అమెరికా వెళ్లగానే ట్రంప్ మాటమార్చాడా??

భారత పర్యటనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు నరేంద్ర మోడీ ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ విమానాశ్రయం లో అడుగుపెట్టినప్పటి నుంచి ఢిల్లీలోని పాలెం విమానాశ్రయంలో విమానం ఎక్కేవరకు మోడీ అడుగడుగునా ట్రంప్ దంపతులకు అతిథి మర్యాదలు చేశారు. భారత పర్యటన తనకెంతో సంతోషాన్నిచ్చిందని చెప్పిన ట్రంప్ మోడీని ఆకాశానికి ఎత్తేశారు. ప్రధాని మోడీ తో తనకు మంచి బంధం ఏర్పడిందని భవిష్యత్తులో ఈ స్నేహ బంధం ఇలాగే కొనసాగిస్తామని కూడా అన్నారు. భారత్ లోనే భారత్ దాయాది దేశమైన పాక్ ప్రస్తావన తెచ్చిన ట్రంప్…ఉగ్రవాదంపై పోరులో పాకిస్తాన్ తో కలిసి పోరాడుతున్నామని చెప్పారు.

ప్రధాని మోడీ సమక్షంలోనే భారత్ బద్ధ శత్రువు పాక్ ప్రస్తావన తేవడం పై అనేక విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా వెళ్లిన తర్వాత ట్రంప్ ఆ వ్యాఖ్యల కొనసాగింపుగా సంచలన వ్యాఖ్యలు చేసినట్లు అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

భారత్ తోపాటు అమెరికా కూడా తమకు మిత్రదేశమని – పాక్ తో తమకు చాలా ఏళ్లుగా మంచి సంబంధాలున్నాయని ట్రంప్ అన్నట్లు కథనాలు వచ్చాయి. అవసరమైతే…పాక్ – భారత్ ల మధ్య కశ్మీర్ విషయంలో మధ్య వర్తిత్తం చేస్తానని కూడా ట్రంప్ అన్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో భారత్ లో మోడీ…నా సరి జోడి అన్న ట్రంప్…అమెరికా వెళ్లిన తర్వాత వెన్నుపోటు పొడిచారని కామెంట్స్ వస్తున్నాయి. ట్రంప్ అమెరికా వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా తన అసలు రంగు బయటపెట్టారని అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పాక్ సరిహద్దులో ఉన్న ఉగ్రవాదులను మట్టుపెట్టడంలో పాక్ కు అమెరికా సాయం చేస్తోందని – ఉగ్రవాదంపై పోరులో భారత్ కు కూడా తాము సాయం చేస్తామని ట్రంప్ అన్నారని కథనం.

అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులు పెంచి పోషిస్తోందని ప్రపంచ దేశాలన్నీ అంటున్నాయి. అయితే ఇందుకు భిన్నంగా ట్రంప్ మాత్రం పాక్ కూడా ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేస్తోందని అందుకు అమెరికా సహకరిస్తోందని చెప్పటం పలువురిని విస్మయానికి గురి చేసింది. బాలాకోట్ లో ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన దాడిని ప్రపంచ దేశాలన్నీ స్వాగతించాయి. అయితే ఆ వ్యవహారం పై పాక్ నోరు మెదప లేదు. అసలు బాలాకోట్ లో దాడి జరగలేదని అక్కడ ఉగ్రవాదులు లేరని పాక్ ఆర్మీ అధికారులు ప్రకటించారు. ఇటువంటి నేపథ్యంలో తాము పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని మట్టుబెడతామని పాక్ చెప్పటం….ఆ వ్యాఖ్యలు ట్రంప్ నమ్మటం ఆశ్చర్యకరంగా ఉంది. ప్రధానంగా అమెరికా తయారు చేస్తున్న ఆయుధాలను పాక్ కొంటోందన్నది జగమెరిగిన సత్యం. ఆ కోణంలో పాక్ తో అమెరికాకు మంచి సంబంధాలున్నాయి.

ఒకవేళ ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ పెద్దన్న పాత్ర పోషిస్తా అంటే భారత్ కు ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఈ విషయాన్ని భారత పర్యటన ముగిసిన తర్వాత అమెరికా వెళ్ళిన తర్వాత చెప్పడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా కాశ్మీర్ సమస్యపై ట్రంప్ నకు చిత్తశుద్ధి ఉంటే భారత పర్యటనలోనే ఆ విషయం గురించి మోడీతో చర్చించి ఉండేవారని అమెరికా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ రకంగా భారత్ లో పర్యటించేటప్పుడు మోడీని ఆకాశానికి ఎత్తేసిన ట్రంప్ అమెరికా వెళ్ళగానే ప్లేట్ ఫిరాయించి మోడీ కి వెన్నుపోటు పొడిచారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ కథనాలలో నిజానిజాలేమిటి…ఒక వేళ ఈ వ్యాఖ్యలు నిజమైతే….మోడీ రియాక్షన్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *