ఆంధ్రప్రదేశ్ లో వేడెక్కిన రాజకీయం..

ఆంధ్రప్రదేశ్ లో దాదాపు తొమ్మిది నెలల తర్వాత మళ్లీ రాజకీయ వాతావరణం వేడెక్కింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేస్తోంది. ఈ మేరకు శుక్రవారం రిజర్వేషన్లు ప్రకటించింది. దీంతో రాజకీయ పార్టీలు స్థానిక సంస్థ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. వెంటనే పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై ఈ ఎన్నికలపై చర్చిస్తున్నాయి. ప్రధానంగా ఇప్పుడు ఏపీలో అధికార పార్టీ వైఎస్సార్సీపీతో పాటు టీడీపీ మధ్య తీవ్ర పోరు ఉండే అవకాశం ఉంది. దీంతో ఈ రెండు పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికలను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్రభుత్వం భావిస్తోంది. అయితే మెజార్టీ స్థానాలు సొంతం చేసుకునేలా జగన్ మంత్రులు ఎమ్మెల్యేలకు ఇంతకు ముందే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు రిజర్వేషన్ల ఖరారు కావడంతో అందరినీ తమ ప్రాంతాల్లో ఉండాలని చెప్పారు. ఈ ఎన్నికలకు ఎత్తులు పై ఎత్తులు వ్యూహాప్రతి వ్యూహాలతో ఆ రెండు పార్టీలు సిద్ధమవుతున్నాయి. వేసవిలో ఈ ఎన్నికలకు రాజకీయ వాతావరణం వేడెక్కింది. దీంతో ఒక్కసారిగా పల్లెల్లో ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది.

ఏకకాలంలో స్థానిక ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరింది. దీని ద్వారా ప్రత్యర్థులకు పెద్దగా అవకాశం కల్పించకుండా అన్ని స్థానాలు తాము సొంతం చేసుకునేలా అధికార పార్టీ ముందస్తు వ్యూహం రచించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం అదే విధంగా కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియ అలా ఉంటే ముందే ప్రతిపక్షాలకు షాక్ తగలనుంది. నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి చేస్తే 14వ ఆర్థిక సంఘం నిధులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువచ్చింది. దీంతో ఎన్నికల సంఘం ఆ మేరకు ప్రణాళిక రూపొందించే అవకాశం ఉంది. మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని వైఎస్సార్సీపీ భావిస్తూ చర్యలు చేపట్టింది. ఈసారి ఎన్నికలు తమ పాలనకు ప్రజలు తీర్పు ఇచ్చే తీర్పుగా భావిస్తోంది. ఈ ఎన్నికలకు రెండు నెలల ముందే నుంచే అధికార పార్టీ పకడ్బందీ వ్యూహం రచించింది. మంత్రులు ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించి మెజార్టీ స్థానాలు రావాలని ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల మాదిరి ప్రతిపక్ష టీడీపీని ఈ ఎన్నికల్లోనూ ఘోరంగా దెబ్బ తీసేలా ప్లాన్ వేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ కార్డు పట్టుకున్న టీడీపీ పై ఎదురు దాడికి దిగాలని నాయకులకు పార్టీ సూచనలు చేసింది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న టీడీపీ దాన్ని కోలుకోని ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని టీడీపీ భావిస్తోంది. జగన్ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేకత విధానాలు రాజధాని తరలింపు బీసీ రిజర్వేషన్ల తగ్గింపు తదితర వాటిని అస్త్రాలుగా చేసుకుని ఎన్నికలకు వెళ్లాలని తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యూహం రచిస్తున్నారు. జగన్ నిర్ణయాలను తప్పుబడుతూ.. అవినీతి పెట్రేగి పోయిందని పెట్టుబడులు రావడం లేదని ప్రజలకు చెబుతూ అమరావతి రాజధానిగా ఉండాలని చెబుతూ ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. టీడీపీకి క్యాడర్ బలంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో నిరాశకు గురైన పార్టీ శ్రేణులకు ఈ ఎన్నికలు ఊపునిచ్చేవే. పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచి గ్రామాల్లో బలం పెంచుకునేలా టీడీపీ సిద్ధమవుతోంది. ఇప్పటికే పార్టీ నాయకులను గ్రామాల్లోకి వెళ్లండి అని సూచనలు చేసింది. ఈ ఎన్నికలను చంద్రబాబు ప్రతిష్టాత్మకం గా భావిస్తున్నారు. జగన్ ప్రభుత్వ పాలనకు రెఫరెండం గా ఈ ఎన్నికలను పేర్కొనే అవకాశం ఉంది.

అయితే ఈ ఎన్నికలపై కాంగ్రెస్ అంతగా ఫోకస్ పెట్టలేదు. రాయలసీమ ప్రాంతంలో కొంత బలంగా ఉండే అవకాశం ఉంది. ఆ మేరకు ఆ పార్టీ చర్యలు చేపట్టనుంది. పార్టీకి పెద్ద దిక్కు లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్. ఇక బీజేపీకి స్థానికంగా అంతగా బలం లేదు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరుతో స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేసుకుని ఓట్లు రాబట్టే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలు ఒకటి ఉంటాయని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు తెలిసో లేదు. కానీ ఆయన మాత్రం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో జనసేన ప్రభావం బొత్తిగా ఉండే అవకాశమే లేదు. ప్రధానంగా ఈ ఎన్నికలు వైఎస్సార్సీపీ టీడీపీ మధ్య హోరాహోరీ గా సాగే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *