ఎన్నికలు వాయిదా పై జగన్ సీరియస్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఈ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు హయాంలో నియమితులయ్యారు. ఆయన తన విచక్షణను కోల్పోయి ప్రవర్తించారు. కరోనా వైరస్ వల్ల ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు చెప్పిన పెద్ద మనిషి… మరోవైపు గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను, మాచర్ల సీఐను కూడా తప్పించేశారు. ఎన్నికలను వాయిదా వేసిన తర్వాత కలెక్టర్లను బదిలీ చేసే అధికారం ఎక్కడుంది?. ఆ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది.’ అని సీఎం జగన్ ప్రశ్నించారు. ప్రజలు తనను ఎన్నుకొని సీఎంను చేస్తే రమేష్ కుమార్ సీఎంలా వ్యవహరిస్తున్నారనే విధంగా జగన్ కామెంట్ చేశారు. ‘ప్రజలు ఎన్నుకొని 151 మంది ఎమ్మెల్యేలను ఇస్తే జగన్ సీఎం అయ్యాడు. మరి అధికారం నాదా? ఈ రమేష్ కుమార్‌దా?. బుర్రలో క్లారిటీ ఉండాలి. పది రోజులు మీరు ఏమైనా చేసుకోండి.’ అని జగన్ అన్నారు.

‘ప్రతి ఒక్కరూ విచక్షణాధికారం అనే పదం ఒకటి నేర్చుకున్నారని జగన్ విమర్శించారు. ‘విచక్షణాధికారం అంట. ఎలక్షన్ వాయిదా. అదే సమయంలో నువ్వే సీఎంగా కలెక్టర్లను మారుస్తావ్. ఎస్పీలను మారుస్తావ్. పేదల ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దంటావ్. అలాంటి అధికారం ఉందా?. ఇక ప్రజాస్వామ్యం ఎందుకు? ప్రజలు ఓట్లేసి ముఖ్యమంత్రులను చేయడం ఎందుకు? ఎలక్షన్ కమిషనర్ ఎవరైతేఉంటారో వాళ్లనే సీఎంగా చేసేయొచ్చు కదా.’ అని సీఎం జగన్ సీరియస్ కామెంట్స్ చేశారు.

ఎన్నికలు పూర్తయ్యే వరకు రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రక్రియను నిలిపివేయాలని ఎస్ఈసీ ఈనెల 14న కలెక్టర్లుకు ఆదేశాలు ఇచ్చిన రమేష్ కుమార్ ఈ రోజు సడన్‌గా ఎన్నికలు వాయిదా వేయడం ఏంటని ప్రశ్నించారు. నిన్నటికీ, ఈ రోజుకీ వచ్చిన మార్పు ఏంటో అర్థం కాలేదన్నారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేస్తోందన్న శుభవార్త వారికి దుర్వార్తలా మారి ఎన్నికలను వాయిదా వేశారని జగన్ ఆరోపించారు.

ఎన్నికలను వాయిదా వేస్తూ తయారైన నాలుగు పేజీల ఆర్డర్ కనీసం ఎలక్షన్ కమిషన్‌లో ఉన్న సెక్రటరీకి కూడా తెలీదని, ఎవరో రాస్తున్నారని, ఎవరో రాసిస్తున్నారని, దాన్ని రమేష్ కుమార్ చదువుతున్నారని జగన్ మండిపడ్డారు. కరోనా వైరస్ అనే కారణం చెప్పి ఎన్నికలను వాయిదా వేసేముందు కనీసం ఆరోగ్య శాఖ కార్యదర్శిని కూడా సంప్రందించలేదని చెప్పారు.ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు రెండూ కలిపితే 10,243 చోట్ల పోటీ జరుగుతోందని, 54,594 నామినేషన్లు వేస్తే కేవలం 43 చోట్ల మాత్రమే చెదురుమదురు ఘటనలు జరిగాయని సీఎం జగన్ చెప్పారు. గతంలో ఇంతకన్నా ఎక్కువే అల్లర్లు జరిగాయని జగన్ అన్నారు. పోలీసుల గురించి తాను గర్వంగా చెబుతున్నానని, వారు ఎక్కడా ప్రేక్షకపాత్ర వహించలేదని, వారి విధులు సమోన్నతంగా నిర్వహించారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *