ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగలేదు:శాంతి భద్రతల ఐ జి ప్రభాకర్ రావు

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గుంటూరు రేంజ్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నా మని ఐ జి ప్రభాకర్ రావు తెలిపారు . శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాం

మాచర్ల లో జరిగిన ఘటనపైనా నిష్పాక్షిక విచారణకు అదేశించాం. డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ గారి ఆదేశాల మేరకు ఆ కేసు విచారణ నుంచి స్థానిక సీఐ దుర్గాప్రసాద్ ని తప్పించి గురజాల డీఎస్పీ శ్రీహరి బాబు కి అప్పగించాం. ఆ ఘటన జరిగిన సమయంలో అటుగా వెళ్తోన్న గురజాల డీఎస్పీ స్పందించిన తీరుపై బాధితులు విశ్వాసం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ అధికారి ద్వారానే విచారణ జరిపించడం వల్ల మరింత పకడ్బందీగా నేర నిర్దారణ చేయవచ్చని విశ్వసిస్తూ ఆయననే విచారణాధికారిగా నియమిస్తున్నాం.ఉన్నతాధికారిని విచారణాధికారిగా చేయడం వల్ల పారదర్శక విచారణ ని ఆశిస్తూ దోషులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం.

సాధారణంగా నేరం జరిగిన ప్రాంతంలో నే, విచారణాధికారి అధికార పరిధిలోనే విచారణ జరుగుతుంది. విచారణకు హాజరు అయ్యేప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తే తగిన రక్షణ కల్పించే బాధ్యత పోలీస్ శాఖదే. అప్పటికీ అభ్యంతరాలు ఉంటే బాధితులు ఉన్న ప్రాంతానికే విచారణాధికారి వచ్చి వాళ్ళ స్టేట్మెంట్స్ ని నమోదు చేస్తారు.

బాధితులు ఎవరైనా విచారణకు సహకరించాలి. విచారణకు సహకరించకుండా పోలీస్ శాఖ పై ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నాం. మరొక్కసారి స్పష్టం చేస్తున్నాం రాజకీయ పార్టీలతో మాకు సంబంధం లేదు, ప్రజల మాన, ప్రాణ, ధన రక్షణకు పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది. మీ రాజకీయ అవసరాల కోసం పోలీస్ శాఖపై విమర్శలు చేసి, వ్యవస్థను ఇబ్బంది పెట్టాలనుకోవడం సరైన చర్య కాదని విన్నవిస్తున్నాం

ఈ సందర్భంగా మనవి చేస్తోన్న విషయం ఏంటంటే పోలీస్ శాఖ కు శాంతిభద్రతల పరిరక్షణనే ప్రధమ కర్తవ్యం. అధికార, ప్రతిపక్ష , ఏ ఇతర రాజకీయ పార్టీనా అన్నది మాకు సంబంధం లేదు. దయవుంచి రాజకీయాలను మాకు అపాదించవద్దని మనవి చేస్తున్నాం.

స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడడమే మా లక్ష్యం.

శాంతిభద్రతల విషయంలో రాజీపడేది లేదన్నది గౌరవ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారి స్పష్టమైన ఆదేశం. ఆ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ అందరి సహకారంతో ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేయాలన్నది మా లక్ష్యం.

అలాగే నేతలు కూడా సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాలలో పర్యటించాలనుకున్నప్పుడు సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇస్తే తగిన భద్రత కల్పిస్తామని హామీ ఇస్తున్నాము. స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామస్థాయిలో ఉండే వివాదాల నేపథ్యంలో ఊహించని విధంగా అల్లర్లు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలు ముందస్తు సమాచారంతో వెళ్తే తగిన రక్షణ ఏర్పాట్లు చేయడానికి అవకాశం ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాం.

మా నిఘా వర్గాలు ఇస్తోన్న అత్యంత విలువైన సమాచారంతో చాలా నేరాలను ముందస్తుగా నివారించగలుగుతూ శాంతియుత వాతావరణానికి అహర్నిశలు కృషి చేస్తున్నామని తెలియచేయుటకు సంతోషిస్తూ సెలవు తీస్కుంటున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *