ఎస్ బ్యాంకు కు పెట్టుబడుల వరద..

మూలధన సంక్షోభం పడిన యస్‌బ్యాంకునకు పెట్టుబడుల వరద పారుతోంది. ముఖ్యంగా ఆర్‌బీఐ ప్రతిపాదించిన పునరుద్ధరణ ప్రణాళికను కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదించింది. అంతేకాదు బ్యాంకునకు అందించే అధీకృత మూలధనాన్ని రూ. 6200 కోట్లకు పెంచినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

అలాగే ప్రభుత్వ బ్యాంకుఎస్‌బీఐ 49 శాతం ఈక్విటీ కొనుగోలు ద్వారా రూ.7250 కోట్ల నిధులను యస్‌ బ్యాంకునకు అందించనుంది. దీంతో యస్‌ బ్యాంకులో పెట్టుబడులకు దిగ్గజ ప్రైవేటు బ్యాంకులు వరుసగా క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, కోటక్‌ మహీంద్రా బ్యాంకులు పెట్టుబడులను ప్రకటించగా శనివారం బంధన్‌ బ్యాంక్‌ రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది.

ఈ మేరకు బోర్డు ఆమోదం లభించినట్టు తెలిపింది. రూ.2 ముఖ విలువున్న షేరును (రూ.8 ప్రీమియంతో) రూ.10 చొప్పున మొత్తం 30 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.300 కోట్లతో కొనుగోలు చేయనున్నామని పేర్కొంది. నగదు రూపేణా ఈ లావాదేవీ జరుగుతుంది. తాజాగా ఫెడరల్ బ్యాంకు కూడా యస్ బ్యాంకులో రూ .300 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించింది. 30 కోట్ల ఈక్విటీ షేర్లను ఈక్విటీ షేరుకు 10 రూపాయల చొప్పున కొనుగోలు ద్వారా రూ. 300 కోట్ల పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని తెలిపింది.

ఇప్పటిదాక యస్‌ బ్యాంకులో ప్రైవేటుబ్యాంకుల పెట్టుబడులు
ఐసీఐసీఐ బ్యాంక్ రూ .1000 కోట్లు
హెచ్‌డీఎఫ్‌సీ రూ. 1,000 కోట్లు
యాక్సిస్‌ రూ.600 కోట్లు
కోటక్‌ మహీంద్రా రూ.500 కోట్లు
బంధన్‌ బ్యాంకు రూ.రూ. 300 కోట్లు
ఫెడరల్‌ బ్యాంకు రూ. 300 కోట్లు

కాగా సమస్యాత్మక ప్రైవేట్ బ్యాంకు యస్‌ బ్యాంకు పునర్నిర్మాణ పథకానికి ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో బ్యాంకు, ఖాతాదారులు నగదు ఉపసంహరణపై తాత్కాలిక నిషేధాన్ని మార్చి 18 న ఎత్తివేయనున్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *