ఎస్ బ్యాంక్ సంక్షోభం పై ఎస్బీఐ చైర్మన్ కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వ ఆర్థిక విధానాలు మొండి బకాయిలు స్వయం తప్పిదాలు తదితర కారణాలతో ఎస్ బ్యాంక్ సంక్షోభంలో మునిగింది. నిండా మునిగిన ఆ బ్యాంక్ ను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర సంస్థలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఆ బ్యాంక్ ను తిరిగి సాధారణ పరిస్థితి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఆ బ్యాంక్ ను ఆదుకునేందుకు కేంద్రం పలు సంస్థలతో సంప్రదింపులు చేస్తోంది. ప్రధానంగా ప్రభుత్వ రంగ అతిపెద్ద ఎస్బీఐతో చర్చలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ సానుకూలంగా స్పందించి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. అయితే మీడియాలో బ్యాంకింగ్ రంగంలో మాత్రం ఎస్ బ్యాంక్ ను ఎస్బీఐ టేకోవర్ చేస్తోందని ప్రచారం సాగుతోంది. దీనిపై ఎస్బీఐ చైర్మన్ కీలక ప్రకటన చేశారు.

ఎస్ బ్యాంకుపై సాగుతున్న ప్రచారం సరికాదు. ఆ బ్యాంక్ లో మావి పెట్టుబడులు మాత్రమేనని అంతేగానీ ఎస్ బ్యాంక్ ను టేకోవర్ చేయడం తమ బ్యాంకులో విలీనం చేసుకోవడమో కాదని ఎస్ బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ బ్యాంకులో మేము పెట్టుబడులు మాత్రమే పెడుతున్నాం.. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు 26 శాతం నుంచి 49 శాతం వరకు ఈ పెట్టుబడులు ఉంటాయి అని వెల్లడించారు. మూడేళ్ల పాటు కనీసం 26 శాతం పెట్టుబడులు ఉంటాయని ఆ తరువాత ఇవి 49 శాతానికి పెరుగుతాయని వివరించారు.

తీవ్ర కష్టాల్లో కూరుకున్న ఎస్ బ్యాంకును పునరుజ్జీవింపజేసేందుకు రిజర్వ్ బ్యాంకు ఓ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. పెట్టుబడి దారుల్లో విశ్వాసం పెంచడానికి గట్టి చర్యలు తీసుకోవాలని అనేకమంది తమ బ్యాంకును కోరినట్టు రజనీశ్ కుమార్ చెప్పారు. ప్రస్తుతం ఎస్ బ్యాంకుకు రజనీశ్ కుమార్ అడ్మినిస్ట్రేటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ బ్యాంకుకు తాము ఎండీని సీఈఓను నియమిస్తామని బ్యాంక్ బోర్డులో తమ బ్యాంకుకు చెందిన ఇద్దరు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని రజనీశ్ కుమార్ మీడియాతో తెలిపారు. ఈ బ్యాంక్ షేర్ల డైల్యూషన్ ని మేం నివారించలేం.. సుమారు రూ.254 కోట్ల షేర్ల డైల్యూషన్ మా చేతుల్లో లేదు అని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *