ఏకగ్రీవాల్లో రికార్డు సృష్టించిన వై స్ ఆర్ సీపీ

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసే సరికి అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏకగ్రీవాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది.

రాష్ట్రంలో 652 జెడ్పీటీసీ స్థానాలకు గాను 125 స్థానాలను ఆ పార్టీ ఏకగ్రీవంగా కైవశం చేసుకుంది. శనివారం రాత్రి 12 గంటల సమయానికి జిల్లాల నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కార్యాలయానికి అందిన ప్రాథమిక సమాచారం మేరకు 9,696 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, అందులో 2000 స్థానాలకు పైగా ఏకగ్రీవం అయ్యాయి. మండలానికి ఒక జెడ్పీటీసీ స్థానం ఉంటుంది.ఈ లెక్కన 125 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడం అరుదని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గత ఐదేళ్ల పాలనలో జన్మభూమి కమిటీలు, టీడీపీ నేతల ఆగడాల పట్ల ప్రజలకు ఉన్న వ్యతిరేకత, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 9 నెలల జనరంజక పాలన పట్ల గ్రామీణ ప్రజలు చూపిస్తున్న ఆదరణతోనే స్థానిక టీడీపీ నేతలు పలుచోట్ల పోటీకి దూరంగా ఉన్నారనేది స్పష్టమైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. దీంతో ఆయా స్థానాల్లో ఎంత మంది పోటీలో ఉన్నారన్న వివరాలతో జిల్లాలో ఎక్కడికక్కడ రిటర్నింగ్‌ అధికారులు జాబితాలు విడుదల చేశారు. ఒక్కో అభ్యర్థే పోటీలో ఉన్న చోట ఎన్నిక ఏకగ్రీవం ఎన్నికయినట్లు రిటర్నింగ్‌ అధికారులు స్థానికంగా ప్రకటించారు.

ప్రజా వ్యతిరేకతతో పోటీకే దూరం..
గత ఏడాది మే నెలలో ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 9 నెలల కాలంలోనే ఎన్నికల ముందు చెప్పిన హామీలలో దాదాపు అన్నీ అమలు చేశారు. ఇందువల్ల ఈ ఎన్నికల్లో తాము పోటీ చేసినా గెలవమేమోనన్న భయం స్థానిక టీడీపీ నాయకులను వెంటాడటం వల్లే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ పోటీలో నిలబడకపోవడానికి వారి విశ్లేషణలో తేలిన కారణాలు ఇవీ..

గత 9 నెలలుగా జనరంజక పాలన సాగుతోంది. సమాజంలోని అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఫలితంగా పోటీ చేయడానికి టీడీపీ అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడింది.

టీడీపీ నాయకత్వం మీద ఆ పార్టీ శ్రేణులకు భరోసా సన్నగిల్లింది. టీడీపీ అధినేత మీద విశ్వాసం కొరవడటంతో పోటీకి టీడీపీ శ్రేణులు విముఖత ప్రదర్శించాయి. ఫలితంగా.. స్థానిక ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులను నిలబెట్టడానికి వెతుక్కోవాల్సిన పరిస్థితి టీడీపీకి వచ్చింది.

టీడీపీకి పెద్దగా భవిష్యత్‌ లేదనే నిర్లిప్త ధోరణి టీడీపీ కార్యకర్తల్లో బలంగా వ్యక్తమవుతోంది. ఆ పార్టీ నాయకుల్లోనూ అదే ధోరణి నెలకొంది. అందువల్ల ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉత్సాహం కొరవడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *