ఏపీ ఎన్నికల వాయిదాపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికల్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రమేష్ కుమార్ వాయిదా వేయడం వెనుక దురుద్దేశం ఉందని ప్రభుత్వం తన పిటిషన్‌లో తెలిపింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిపేలా ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు తాను అన్ని చర్యలూ తీసుకుంటున్నానని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్‌లో వివరించింది.

హైకోర్టు ఆదేశాలకు అనుగూణంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయనీ… కనీసం హైకోర్టుకు సమాచారం ఇవ్వకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీటిని వాయిదా వేశారని ఏపీ సర్కార్ తెలిపింది. అయితే కరోనాను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించడం వల్ల… ఎన్నికలు జరిగితే ప్రజలు గుంపులుగా వచ్చే అవకాశం ఉంటుందనీ, క్యూలైన్లలో ఉండేటప్పుడు కరోనా వైరస్ ప్రబలే పరిస్థితి ఉంటుంది కాబట్టి… ముందు జాగ్రత్తగా ఎన్నికల్ని వాయిదా వేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు.

ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఈ కేసులో ఎలాంటి తీర్పు ఇస్తుంది? వైసీపీ ప్రభుత్వం అనుకున్న విధంగా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదే విషయంలో ఏపీ హైకోర్టులో కూడా ఓ పిటిషన్ దాఖలైంది. ఐతే… సుప్రీంకోర్టులో ఆల్రెడీ దాఖలైనందువల్ల ముందు సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చాక తాము నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు తెలిపింది. మరోవైపు మహారాష్ట్ర, బెంగాల్‌లో కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకొని… స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేశారు. ఐతే… ఆ రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్షాలన్నీ ఈ విషయంలో ఒకే అభిప్రాయంతో ఉండటం వల్ల అక్కడ దీనిపై దుమారం రేగలేదు.

ఏపీలో అధికార పార్టీ… ఎస్ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం వల్ల ఈ సమస్య తలెత్తింది. సుప్రీంకోర్టు గనక ఎన్నికలు జరపాల్సిందే అంటే… ఎస్ఈసీ ఆఘమేఘాలపై ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఎన్నికల వాయిదాను సమర్థిస్తే… నెక్ట్స్ ఎప్పుడు జరుగుతాయో తేలాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *