ఏపీ డీజీపీ పై హైకోర్టు ప్రశ్నల వర్షం..ఆయనేమన్నారంటే?

ఏపీలో రాజకీయం ఎలా ఉందన్నది టీవీ చానళ్లు.. పత్రికల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతున్న సంగతి. ఎల్లో మీడియా అంటూ సాగే ప్రచానికి రివర్స్ గేర్ లో బ్లూ మీడియా అంటూ కొత్త పేరు తెర మీదకు వచ్చింది. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు.. దీనిపై అమరావతి పరిసర గ్రామాల్లో చోటు చేసుకుంటున్న ఆందోళనలు.. దీనిపై పోలీసు చర్యలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పోలీసుల పాత్రపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

ఇదిలా ఉంటే.. ఇటీవల నిరసన వ్యక్తం చేసేందుకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖకు వెళ్లటం.. ఆ సందర్భంగా ఆయనకు సీఆర్పీఎస్ సెక్షన్ 151 కింద నోటీసులు జారీ చేయటం హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ డీజీపీని హైకోర్టు స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

గురువారం ఉదయం 10.25 గంటలకు హైకోర్టుకు వచ్చిన డీజీపీ సాయంత్రం నాలుగు గంటల వరకూ ఉండాల్సి వచ్చింది. హైకోర్టు విచారణకు హాజరైన ఆయన.. ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వచ్చింది. ఈ సందర్భంగా కోర్టు అడిగిన ప్రశ్నలు.. వాటికి డీజీపీ ఇచ్చిన సమాధానాల్ని ఆసక్తికరంగా మారాయి. దీనికి సంబంధించిన కోర్టు జరిగిన విచారణకు సంబంధించిన వివరాల్ని కొన్ని మీడియా సంస్థలు పబ్లిష్ చేశాయి. వాటిల్లో ఒకదానిని యథాతధంగా తీసుకుంటే.. హైకోర్టులో విచారణ ఎంతలా జరిగిందో ఇట్టే అర్థం కాక మానదు.

పోలీసు చర్యల్ని హైకోర్టు ధర్మాసనం తీవ్రంగా తప్పు పట్టటమే కాదు.. విశాఖలో బాబును అరెస్టు చేసేందుకు ఇచ్చిన నోటీసుల్ని రాష్ట్ర డీజీపీ.. విశాఖ డీసీపీ చేత స్వయంగా చదివించారు. ఆనంతరం విచారణ సాగిన తీరు ఎలా ఉందంటే..

ధర్మాసనం: పోలీసులు ప్రతిపక్ష నేతకు సీఆర్పీసీ సెక్షన్ 151 కింద నోటీసు జారీ చేయవచ్చా? ఆ సెక్షన్ కింద ఆయనను అరెస్టు చేయవచ్చా? తీవ్ర నేరాలకు పాల్పడే అవకాశముంటే వాటిని అడ్డుకునేందుకు అలాంటి నోటీసు ఇస్తారని మీరే చదివారు. ప్రతిపక్షనేత విశాఖ వచ్చినప్పుడు ఎవరు తీవ్ర నేరం చేయబోయారు? ఆ నేరానికి రూపకల్పన చేసిందెవరు? మీరెవరిని అరెస్టు చేశారు? దీనిని ఎలా సమర్థించుకుంటారు? చంద్రబాబు పర్యటనకు మీరే అనుమతి ఇచ్చారు కదా?!

డీజీపీ: అక్కడ నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితుల కారణంగా 151 కింద నోటీసు ఇవ్వాల్సి వచ్చింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే అక్కడ నెలకొన్న ఉద్రిక్తలను అదుపు చేసేందుకు మాజీ ముఖ్యమంత్రిని రక్షించేందుకు ఆ చర్యలు తీసుకున్నాం.

ధర్మాసనం: పరిస్థితుల్ని చక్కదిద్దే చర్యలను కాదనడం లేదు. అది పోలీసుల బాధ్యత కూడా! పరిస్థితులు చేయి దాటిపోతున్నాయనుకున్నప్పుడు నివారణ చర్యలు చేపట్టాల్సిందే. కానీ… ప్రతిపక్ష నేతపై సీఆర్పీసీ సెక్షన్ 151ని ఎలా ప్రయోగిస్తారు? ముందు జాగ్రత్త కోసం అరెస్టు చేసే విధానం ఇదేనా? మీ కింది ఉద్యోగి న్యాయంగా నడుచుకో లేదు. 151 కింద నోటీసు ఇచ్చిన ఏసీపీ వైఖరిని విశాఖ సీపీ కూడా సమర్థించారు. అందుకే మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది. మీ కింది ఉద్యోగి తప్పు చేయడం వల్లనే మిమ్మల్ని పిలిచాం!

డీజీపీ: 151 కింద నోటీసు ఇవ్వాల్సింది కాదు. అది ఆ పరిస్థితులకు అనుగుణంగా లేదు.

ధర్మాసనం: మీ విశాఖ సీపీ సమాధానంలో అలా లేదు. ఆ నోటీసును ఆయన సమర్థించుకున్నారు. చట్ట నియమాలను ఉల్లంఘించారు.

డీజీపీ: ఆ నోటీసు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా లేదు.

ధర్మాసనం: ప్రతిపక్ష నేత విశాఖ వచ్చినప్పుడు ఎవరు తీవ్ర నేరం చేయబోయారు? ఆ నేరానికి రూపకల్పన చేసిందెవరు? మీరెవరిని అరెస్టు చేశారు? మీరు ఈ రాష్ట్రానికే డీజీపీ. రాష్ట్రంలో చట్టాలు సక్రమంగా అమలయ్యేలా చూడడం మీ బాధ్యత. హైకోర్టు కల్పించుకుని చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు. భవిష్యత్తులోనూ ఇదే కొనసాగితే మేం జోక్యం చేసుకుని తగిన ఆదేశాలు ఇవ్వాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడతాయి. రాష్ట్రంలో చట్ట నిబంధనలు సరిగ్గా అమలు కావడం లేదు. ఈ కేసు ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ఘటనలపై చాలా కేసులు మా ముందున్నాయి. అందుకే మిమ్మల్ని వ్యక్తిగతంగా నేరుగా రమ్మని పిలిపించాం.

డీజీపీ: మీరు జారీ చేసే మార్గదర్శకాలను అనుసరించి నడచుకుంటాం. వాటిని అమలు చేస్తాం.

ధర్మాసనం: సీఆర్పీసీ 151 కింద నోటీసు ఇవ్వడం తప్పిదమేనని మీరు అంగీకరించారు. అందుకు బాధ్యులైన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారు?

డీజీపీ: ఈ వ్యవహారం కోర్టులో ఉంది కాబట్టి చర్యలు తీసుకోలేదు. కోర్టు ఆదేశాల కోసం చూస్తున్నాం.

ధర్మాసనం: కోర్టులో ఉన్నదానికి మీరు చర్యలు తీసుకోవడానికి సంబంధం లేదు. మీ కింది స్థాయి అధికారి తప్పు చేసినప్పుడు చర్యలు తీసుకునే అధికారం మీకుంది. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోండి.

డీజీపీ: బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

ధర్మాసనం: విశాఖ ఏసీపీ తప్పు చేసినందున ఆయనపై చర్యలు తప్పవు. ఏసీపీ చర్యల్ని సమర్థించిన విశాఖ సీపీపై ఏం చర్యలు తీసుకోబోతున్నారు?

డీజీపీ: ఇద్దరిపైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం!

ధర్మాసనం: ఆ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయండి.

‘రాజధాని’ అమరావతిపై గ్రామాల్లో చోటు చేసుకున్న పరిణామాలపై..

ధర్మాసనం: మీరు పెన్ డ్రైవ్ లో ఉన్న వీడియోను చూశారా?

డీజీపీ: చూశాను.

ధర్మాసనం: ఆ గ్రామంలో 500 మంది పోలీసులు ఎందుకున్నారు? అక్కడ అంతమంది అవసరమా? ఆ వీడియోలోని పోలీసు హెచ్చరికలు అభ్యంతరకరంగా ఉన్నాయి. అంత అవసరం ఏం వచ్చింది?

డీజీపీ: అది జనవరి 10 తేదీన… రాజధాని ఆందోళనలు మొదలైన 22 రోజుల తరువాత మందడంలో జరిగింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేశారు.

ధర్మాసనం: నిరసన ప్రశాంతంగా జరుగుతున్నప్పుడు అంతమంది పోలీసులతో ఫ్లాగ్ మార్చ్ జరపాల్సిన అవసరం ఏమొచ్చింది? పోలీసులు వ్యవహరించిన తీరు వారి ప్రకటన మనం ప్రజాస్వామ్య దేశంలో లేమన్న భావన కలిగించేలా ఉంది. 500 మంది పోలీసులు కశ్మీర్ లో ఫ్లాగ్ మార్చ్ చేస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ ఇక్కడంత అవసరమేమొచ్చింది?

డీజీపీ: ఆ ఒక్కరోజే అలా జరిగింది.

ధర్మాసనం: ఒక్కరోజు కాదు. వరుసగా జరుగుతూనే ఉంది. మీరు రాష్ట్ర పోలీస్ శాఖకు అధిపతి. చట్టప్రకారం నడుచుకోని వారిపై చర్యలు తీసుకోండి. దీనిపై మళ్లీ మళ్లీ చెప్పబోం. ‘ప్రభుత్వాలు వస్తాయి పోతాయి. కానీ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించకుంటే ఎలా? నిబంధనల మేరకు నడుచుకోవాల్సిందే. అది ఈ రోజు నుంచే ప్రారంభం కావాలి. మా ఆదేశాలు అమలు చేస్తారని ఆశిస్తున్నాం.

డీజీపీ: థ్యాంక్యూ సర్. చట్టాల్ని సక్రమంగా అమలు చేసే బాధ్యత తీసుకుంటాను. అది నా కర్తవ్యం. మీ ఆదేశాలను పాటిస్తాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *