ఏపీ, తెలంగాణలో ఇంటర్ పరీక్షలు…

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బుధవారం నుంచీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్స్ రాసేలా అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. ఏపీలో మార్చి 4 నుంచీ… మార్చి 23 వరకూ ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి. రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. మొత్తం 411 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. ఇంటర్‌ పరీక్షలకు 10,65,156 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వారిలో జనరల్‌ విద్యార్థులు 9,96,023 మంది, వొకేషనల్‌ విద్యార్థులు 69,133 మంది ఉన్నారు. విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 8 గంటల నుంచే అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాల్లో ఫర్నిఛర్‌, ఇతర మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పిస్తారు. మాస్‌ కాపీయింగ్‌ చేయనివ్వకుండా ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, సిట్టింగ్‌ స్క్వాడ్స్‌ ఏర్పాటు చేశారు. అలాగే పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో ఉన్న అన్ని జిరాక్స్‌ కేంద్రాల్నీ… పరీక్షలు జరిగే సమయంలో మూసివేస్తారు. అలాగే సీసీ కెమెరాల నిఘా కూడా ఉంటుంది. విజయవాడ నుంచీ ఆన్‌లైన్‌ ద్వారా సీసీ కెమెరాల్ని పర్యవేక్షించి అవసరమైన సూచనలు చేస్తారు. పరీక్షా కేంద్రాల్లోకి ఇన్విజిలేటర్లు కూడా సెల్‌ఫొన్స్‌ తీసుకురారు. డిపార్టుమెంట్‌ ఆఫీసర్‌, ఛీప్‌ సూపరింటెండెంట్స్‌ దగ్గర మాత్రమే సెల్‌ఫోన్స్‌ ఉంటాయి. విద్యార్థులు పరీక్షా కేంద్రాలు గుర్తించడానికి ప్రత్యేకంగా యాప్‌ను రెడీ చేశారు. ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌ లేదా గుగూల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ యాప్‌లో సెంటర్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయగానే GPS విధానం ద్వారా చిరునామా, సెంటర్‌ వివరాలు కనిపిస్తాయి. సెంటర్‌‌కి ఎలా వెళ్ళాలో కూడా గుగూల్‌ మ్యాప్ చూపిస్తుంది. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. 1800 2749868, 0866 2974130 నెంబర్లకు ఫోన్ చేసి కంప్లైంట్లు చెయ్యవచ్చని వివరించారు. 9391282578 నెంబర్‌కు వాట్సాప్ ద్వారా మెసేజ్ రూపంలో సమస్యలు తెలపవచ్చన్నారు.

తెలంగాణలో కూడా ఈసారి అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష జరుగుతుంది. విద్యార్థులంతా 15 నిమిషాల ముందే పరీక్ష హాల్‌కు చేరుకోవాలనే కండీషన్ పెట్టారు. ఈసారి కూడా నిమిషం నిబంధన కఠినంగా అమలు చేస్తా్మన్నారు. తెలంగాణవ్యాప్తంగా సుమారు 9.65 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు రాయబోతున్నారు. ఎగ్జామ్‌కి వచ్చేవాళ్లు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలూ, మొబైల్సూ తీసుకురాకూడదనే కండీషన్ పెట్టారు. ప్రతీ సెంటర్‌లో 4 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఇదివరకు జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకుని ఈసారి 100 శాతం యాక్యురేట్‌గా ఫలితాలు ప్రకటిస్తామని అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు ముందుగానే సెంటర్లకు చేరుకోవడానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. విద్యార్థులు గంట ముందే ఎగ్జామ్ సెంటర్‌కి వచ్చి, తమకు కేటాయించిన ఎగ్జామ్ హాళ్లను, పరీక్షా పేపర్లను పొందాలని అధికారులు తెలిపారు. సెంటర్ల దగ్గర అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *