ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్ రావుకు షాకిచ్చిన క్యాట్

ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్ రావుకు క్యాట్(సెంట్రల్ అప్పిలేట్ ట్రైబ్యూనల్) షాక్ ఇచ్చింది. తనను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడంపై క్యాట్‌ను ఆశ్రయించగా.. పిటిషన్‌ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం తనను సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధమని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

గతేడాది మే 31 నుంచి తనకు జీతం చెల్లించకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే తనపై సస్పెన్షన్ వేటు వేశారని ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌కు తెలిపారు. తనపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌పై స్టే విధించాలని ఆయన తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. విచారణ చేపట్టిన క్యాట్.. ఆయన పిటిషన్‌ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించుకోవచ్చని క్యాట్ ఏబీ వెంకటేశ్వరరావుకు సూచించింది. కాగా.. పోలీసు శాఖ ఆధునికీకరణ పేరుతో రాష్ట్ర ఖజానాకు రూ.25కోట్ల మేర నష్టం కలిగించారంటూ ఏపీ ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది.

1989 ఏపీ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వర్‌రావు.. ఏడీజీపీగా పనిచేసినప్పుడు ఆయన నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్లు డీజీపీ నివేదిక సమర్పించారు. ఆ మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం తన ఆదేశాల్లో తెలిపింది. టీడీపీ ప్రభుత్వ హయాం‌లో ఏబీ వెంకటేశ్వర రావు ఇంటెలిజన్స్ చీఫ్‌గా వ్యవహరించారు.

వైసీపీ ఫిర్యాదు మేరకు గత ఎన్నికలకు ముందు ఆయన్ను ఇంటెలిజన్స్ చీఫ్ పదవి నుంచి ఎన్నికల సంఘం బదిలీ చేసింది. డీజీపీ స్థాయిలోని సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటెలిజన్స్ చీఫ్ ఏవీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *