ఏపీ లో మంత్రి పదవులు దక్కేది ఎవరికీ??

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఫ్యాన్ గాలివీయడంతో వైసీపీ ఏకంగా 151ఎమ్మెల్యేలను గెలిచిన సంగతి తెల్సిందే. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక కొందరు నేతలకు మంత్రి పదవులను ఇస్తానని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గతంలో వారికి హామీ ఇచ్చారు. మంత్రి పదవుల్లో కుల సమీకరణలు రిజర్వేషన్లు మహిళా కోట వంటి కారణాలతో కొందరికీ మంత్రి పదవులు దక్కలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక.. 25మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కొందరికీ మంత్రి పదవులు దక్కకపోవడంతో పార్టీలో అలకలు మొదగలయ్యాయి. దీంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారిని పిలిచి బుజ్జగించే ప్రయత్నం చేశారు. మళ్లీ క్యాబినెట్ విస్తరించినపుడు అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండున్నరేళ్ల తర్వాత కొత్త మంత్రులను తీసుకుంటామన్న హామీ ఇచ్చారంట.. ప్రత్యామ్మాయం గా కొందరికీ క్యాబినెట్ హోదా కలిగిన పదవులను కట్టబెట్టారు.

* త్వరలో రెండు మంత్రి పదవులు ఖాళీ..
ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిరోజుల్లోనే పాలనపై తన మార్కు చూపిస్తున్నారు. తాను ప్రజా సంక్షేమం కోసం తీసుకునే నిర్ణయాలు అమలు కాకుండా చేసే వారిపట్ల కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ఏపీలో పాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం పొందగా శాసనమండలి ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపింది. దీంతో జగన్మోహన్ రెడ్డి ఏకంగా శాసనమండలినే రద్దు చేశారు. అయితే శాసనమండలి రద్దు కావాలంటే పార్లమెంట్ రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. ఈ తతాంగానికి కొంత సమయం పట్టినా శాసనమండలి రద్దవడం ఖాయం. దీంతో శాసనమండలి నుంచి ఎన్నికై మంత్రి పదవులు దక్కించుకున్న వారు త్వరలోనే మాజీలు అవడం ఖాయంగా కన్పిస్తుంది. శాసనమండలి రద్దైన తర్వాత టెక్నికల్ గా మంత్రి పదవుల్లో ఆరునెలల వరకు కొనసాగవచ్చు. అయితే ఆ తర్వాత వారు ఆ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో ఇక్కడ ఖాళీ అయ్యే పదవులను దక్కించుకునేందుకు వైసీపీ నేతలు ఇప్పటి నుంచే లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

* త్వరలోనే క్యాబినెట్ విస్తరణ?
శాసనమండలి రద్దవడంతో ఏర్పడే ఖాళీలతో పాటు త్వరలోనే క్యాబినెట్ విస్తరణ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. శాసనమండలి నుంచి మోపీదేవి వెంకటరమణ పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రి పదవులు దక్కించుకున్నారు. వీరి స్థానాల్లో కొత్తవారికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. గతంలోనూ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నవారు ఈసారి ఎలాగైన క్యాబినెట్ బెర్త్ కొట్టేయాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో ముందువరుసలో ఉన్నది మాత్రం ఎమ్మెల్యే రోజా. నగరి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకు కిందటిసారే మంత్రి పదవి దక్కుతుందని భావించారు. అయితే సామాజికవర్గం కోటా సాకుతో ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేదు. అయితే ఆమెకు క్యాబినెట్ హోదాతో సమానమైన ఏపీఐఐసీ పదవిని జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు. దీంతో రోజా విషయం సర్దుమణిగింది. అయితే రెండు మంత్రి పదవులు ఖాళీలవుతుండటంతో ఈసారి మంత్రి పదవి దక్కించుకునేందుకు రోజా ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మంత్రి పదవీ పై ఆశ పెట్టుకున్నారు.

అమరావతి రాజధాని మార్పు నేపథ్యంలో అక్కడ బలమైన వాయిస్ వినిపించేందుకు ఆళ్ల రామకృష్ణా రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.. . వీరితో పాటు స్పీకర్ తమ్మినేని వీరభద్రం కూడా మంత్రి పదవీ రేసులో ఉన్నట్లు ఊహగానాలు విన్పిస్తున్నాయి. మంత్రి పదవులు ఖాళీ అయ్యే స్థానాలు బీసీ కోటాలో ఉండటం తో బీసీ వర్గానికి చెందిన నేతలు ఇప్పటి నుంచే లాబీయింగ్ చేస్తున్నారు. మొత్తం రెండు పదవుల కోసం డజనుకు పైగా నేతలు క్యూ కట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఎవరికీ వారు జగన్మోహన్ రెడ్డి ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మంత్రి బెర్త్ భర్తీకి కనీసం ఎడెనిమిది నెలలు పట్టే అవకాశం ఉంది. అప్పటిగానీ మంత్రి పదవులు ఎవరికీ దక్కుతాయో క్లారిటీ రాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *