ఏప్రిల్ 1న ఈ బ్యాంకుల విలీనం…

ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్-OBC, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-UBI, సిండికేట్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, అలాహాబాద్ బ్యాంక్‌లో అకౌంట్లు ఉన్నాయా? ఈ బ్యాంకుల్ని వేరే బ్యాంకుల్లో విలీనం చేస్తోంది కేంద్రం. మరి మీరేం చేయాలో తెలుసుకోండి..
ఏప్రిల్ 1న ఈ బ్యాంకుల విలీనం. కస్టమర్లు ఏం చేయాలంటే..
మరోసారి ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం అంశం తెరపైకి వచ్చింది. 10 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని కలిపేసి 4 బ్యాంకులుగా మార్చేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1న బ్యాంకులు విలీనం కానున్నాయి. బ్యాంకుల ఏకీకరణ ప్రక్రియ పూర్తైతే 2017లో 27 గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12 కు తగ్గిపోతుంది. కేంద్రం ప్రణాళికల ప్రకారం పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్-OBC, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-UBI, కెనెరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంకులో అలాహాబాద్ బ్యాంక్ విలీనం కానున్నాయి.
బ్యాంకుల విలీనం కస్టమర్లకు లాభమా? ఖాతాదారులు నష్టపోతారా? విలీనం తర్వాత అకౌంట్లలో జరిగే మార్పులు ఏంటీ అన్న సందేహాలు చాలామందిలో ఉన్నవే. బ్యాంకుల విలీనం రాత్రికి రాత్రి జరిగేది కాదు. కొన్ని నెలల పాటు సాగే ప్రక్రియ. ఈ నాలుగు బ్యాంకుల విలీనం గురించి గతేడాది ఆగస్టులోనే ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అయితే బ్యాంకుల విలీనం పేరు వినగానే సదరు బ్యాంక్ ఖాతాదారులు కంగారుపడాల్సిన అవసరం లేదు. విలీన ప్రక్రియలో కస్టమర్లకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటాయి బ్యాంకులు. అకౌంట్ల విషయంలో ఏవైనా మార్పులు ఉంటే కస్టమర్లకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తాయి.

మీ దగ్గర ఉన్న ఏటీఎం కార్డులు, చెక్ బుక్స్ కొన్ని రోజులవరకు వాడుకోవచ్చు. ఏ బ్యాంకులో విలీనం అయితే ఆ బ్యాంకు పేరుతో పాస్ బుక్స్, ఏటీఎం కార్డులు వస్తాయి. కస్టమర్లు బ్యాంకుకు వెళ్లి మార్చుకోవచ్చు. ఇప్పుడు ఉన్న బ్రాంచ్‌లోనే బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. బ్రాంచ్‌ల లొకేషన్‌లో ఎలాంటి మార్పు ఉండదు. ఒకవేళ ఏవైనా మార్పులు ఉంటే బ్యాంకులు సమాచారం ఇస్తాయి. మీకు అకౌంట్ ఉన్న బ్రాంచ్‌లోనే ఎప్పట్లాగే బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. అయితే అకౌంట్ బ్యాలెన్స్ లిమిట్‌లో స్వల్ప మార్పులు ఉంటాయి. ఆ వివరాలను ముందే తెలుసుకోవడం మంచిది. రుణాలకు సంబంధించి నియమనిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండవు. ఎలాంటి మార్పులు జరిగినా కస్టమర్లకు సమాచారం వస్తుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో కొన్ని మార్పులు ఉంటాయి. ఈఎంఐలు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం ఆటో డెబిట్ ఫామ్స్ మళ్లీ ఇవ్వాల్సి ఉంటుంది.
బ్యాంకులు విలీనమైనా మీ అకౌంట్‌లో డబ్బులు సురక్షితంగానే ఉంటాయి. బ్యాంకు అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ మారే అవకాశం ఉంటుంది. ఈ అప్‌డేట్స్ బ్యాంకులో తెలుసుకోవచ్చు. ఉచిత సేవలు, ఛార్జీలు, డిపాజిట్లకు, రుణాలకు వడ్డీ రేట్లు, మినిమం బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోండి. బ్యాంకుల విలీనంపై వచ్చే పుకార్లను అస్సలు పట్టించుకోవద్దు. బ్యాంకుల విలీనం సమయంలో నకిలీ ఇమెయిల్స్, లెటర్స్ సర్క్యులేట్ అయ్యే ప్రమాదం ఉంది. ఎట్టిపరిస్థితుల్లో మీ అకౌంట్ వివరాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడీ, పిన్, కార్డు వివరాలు ఎవరికీ వెల్లడించకూడదు. ఏ అనుమానం ఉన్నా దగ్గర్లో ఉన్న బ్రాంచ్‌కు వెళ్లి తెలుసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *