ఐసీఐసీఐ బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం.. 43 లక్షల డిపాజిట్ గల్లంతు

సికింద్రాబాద్‌ లోని ఐసీఐసీఐ బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తాను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసిన రూ.43,07,535 గళ్లంతయ్యిందని ఎన్నారై రాజా ఉత్తమ్‌కుమార్‌ అతని న్యాయవాది పీవీ కృష్ణమాచారి ఆరోపించారు.తనకు జరిగిన మోసంపై సచివాలయంలోని రాష్ట్ర ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ అడ్జుడికేటింగ్‌ అధికారి ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశామని, దీనిపై విచారణ చేపట్టిన అధికారులు బ్యాంకుదే బాధ్యతగా నిర్ధారిస్తూ ఖాతానుంచి గళ్లంతైన సొమ్మును 9శాతం వడ్డీతో పాటు కోర్టు ఖర్చులకింద రూ.50వేలు, ఖాతాదారులను మానసికంగా ఇబ్బంది పెట్టినందుకు మరో రూ.5 లక్షలు అరవై రోజుల్లో చెల్లించాలని ఆదేశించారన్నారు. అయితే బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బ్యాంకు ఆస్తులను జప్తు చేసుకోవాలని కోరుతూ సోమవారం అడ్జుడికేటింగ్‌ అధికారికి వినతిపత్రం అందజేశామన్నారు. 2015లో సికింద్రాబాద్‌ ఎస్డీ రోడ్డులోని ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతా తెరిచిన తాను రూ.50 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఎఫ్‌డీ చేసి అమెరికా వెళ్లిపోయినట్లు తెలిపాడు. అదే ఏడాది డిసెంబర్‌లో ఖాతాను చెక్‌చేసుకోగా పాస్‌వర్డ్‌ మారినట్లు సమాచారం అందిందన్నారు.ఈ విషయమై ఐసీఐసీఐ బ్యాంకు విచారణ విభాగాన్ని సంప్రదించగా విచారణ చేసి చెబుతామని చెప్పారని, కొన్ని రోజుల తర్వాత పాస్‌వర్డ్‌ మార్చుకోవాలని సూచించినట్లు తెలిపారు. తీరా ఖాతాలో చూసుకోగా రూ.43,07,535 విత్‌డ్రా అయినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ విషయమై బ్యాంకు అధికారులను ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకపోవడంతో 2016లో సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు భాస్కర్‌ రాజు అనే వ్యక్తిని అరెస్ట్‌ చేసి రూ. 2 లక్షలు వసూలు చేశారన్నారు. నిందితుల్లో కొందరు విదేశాలకు వెళ్లడంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారన్నారు.బ్యాంకు, పోలీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో ఖాతా వివరాలు భద్రంగా ఉంచాల్సిన బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మోసం జరిగిందని ఆరోపిస్తూ 2017లో డిసెంబర్‌లో రాష్ట్ర అడ్జుడికేటింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశామన్నారు. వారు పూర్తిస్థాయిలో విచారించి ఖాతాదారుని డబ్బులు భద్రపర్చడంలో బ్యాంకు విఫలమైందని నిర్ధారిస్తూ గళ్లంతైన సొమ్ముకు 9 శాతం వడ్డీ, ఖర్చులకింద రూ.50వేలు, ఖాతాదారుడిని మానసికంగా బాధపెట్టినందుకు రూ. 5 లక్షలు 60 రోజుల్లో చెల్లించాలని 2019 అక్టోబర్‌లో తీర్పు ఇచ్చినట్లు తెలిపారు. ఈ గడువు ముగిసినా బ్యాంకు నుంచి ఎలాంటి స్పందన లేదని, ఈ నేపథ్యంలో బ్యాంకు ఆస్తులను జప్తు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *