కడప జడ్పీ పీఠం దక్కేది ఎవరికి?

శాస‌న‌మండ‌లి ర‌ద్దు ప్ర‌క్రియ న‌డుస్తోంది. ఎమ్మెల్సీ సీటు ఆశ ఇక‌లేదు. అయితే మున్సిప‌ల్ ఛైర్మ‌న్ లేదా కార్పొరేష‌న్ మేయ‌ర్ లేదా జ‌డ్పీ ఛైర్మ‌న్‌… ఈ మూడు కూడా కేబినెట్ ర్యాంక్ పోస్టులే. దీంతో ఇప్పుడు వీటికి ఏపీలో భారీగా పోటీ ఏర్ప‌డింది. జ‌డ్పీ ఛైర్మ‌న్‌ సీటు కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.

క‌డ‌ప జ‌డ్పీ ఛైర్మ‌న్ సీటు జ‌న‌ర‌ల్‌కు రిజర్వ్ అయింది. దీంతో ఇక్క‌డ పోటీ ఏర్ప‌డింది. ఈసీటు కోసం చాలా మంది పోటీ ప‌డుతున్నారు. అయితే ప్ర‌ధానంగా ముగ్గురి మ‌ధ్య ర‌చ్చ న‌డుస్తోంది.

రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమ‌ర్నాథ్‌రెడ్డి జ‌డ్పీ ఛైర్మ‌న్ రేసులో ముందు ఉన్నారు. ఈయ‌న‌కు జ‌గ‌న్ హామీ ఇచ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎన్నిక‌ల ముందు ఈనియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యే మేడ‌పాటి మ‌ల్లికార్జున‌రెడ్డి వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే అయ్యారు. ఆయ‌న వ‌చ్చిన‌పుడు ఆకేపాటి సీటు త్యాగం చేశారు. దీంతో ఆయ‌న‌కు స‌ముచిత స్థానం క‌ల్పిస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ లేదా మంచి నామినేటెడ్ పోస్టు ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు ఆయ‌న‌కు జ‌డ్పీ ఛైర్మ‌న్ ఇస్తార‌ని తెలుస్తోంది.

ఆకేపాటి త‌ర్వాత కమ‌లాపురం ఎమ్మెల్యే, జ‌గ‌న్ మేన‌మామ ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి కొడుకు రామాంజనేయులు రెడ్డి కూడా రేసులో ఉన్నార‌ట‌. ఈయ‌న కూడా జ‌డ్పీఛైర్మ‌న్ పోస్టు ఆశిస్తున్నార‌ట‌.

మ‌రోవైపు శివానందారెడ్డి కూడా జ‌డ్పీపీఠంపై గురిపెట్టార‌ట‌. ఈయ‌న రాజ్య‌స‌భ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి బంధువు. ఈయ‌న కూడా సీటు ఎలాగైనా సాధించాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు.

మొత్తానికి క‌డ‌ప జ‌డ్పీ సీటు కోసం ముగ్గురు పోటీ ప‌డుతున్నారు. చివ‌రి నిమిషంలో ఈ పోటీలోకి కొత్త‌వారు వ‌చ్చే అవ‌కాశం కూడా లేకపోలేదని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *