కరోనా వైరస్ దెబ్బ… రొయ్యల రైతులకు నష్టాలు..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ సెగ రొయ్య రైతుకూ తగిలింది. మన దేశం నుంచి చైనా, జపాన్‌ తదితర దేశాలకు రొయ్యల ఎగుమతి తగ్గిపోయిందంటూ వ్యాపారులు గత వారంరోజులుగా రొయ్యల ధరలను తగ్గించేశారు. క్రమేపీ ఈ ధరలు తగ్గుముఖం పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు మేత ధరలకు రెక్కలొచ్చాయి. రొయ్యల మేత తయారీలో ఉపయోగించే ముడి సరుకుల దిగుమతులు నిలిచిపోయాయంటూ వ్యాపారులు ధరలను బారీగా పెంచేశారు. దీంతో జిల్లాలోని ఆక్వా రైతులు దిక్కుతోచని స్థితిలోపడి పోయారు. కరోనా పేరుతో గత వారంరోజులుగా కేజీ రొయ్యలకు రూ.30 వంతున తగ్గించి కొనుగోలు చేస్తున్నారు.
రొయ్యల్లోని అన్ని కౌంట్లకు రొయ్యల ధరలు రూ.30 వంతున తగ్గించి వేశారు. వాస్తవానికి మన రాష్ట్రం నుంచి చైనాకు తక్కువగానే రొయ్యల ఎగుమతులు జరుగుతుంటాయి. చైనాను కుదిపేస్తున్న కరోనా ప్రభావం కారణంగా ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు భారత్‌ నుంచి రొయ్యల ఎగుమతులను నిలిపివేస్తున్నాయంటూ వ్యాపారులు రైతుల నుంచి ధరలు తగ్గించారు. కరోనా వైరస్‌ కారణంగా వైద్యులు మాంసాహారాలు తినవద్దని సలహా ఇస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా వినియోగం తగ్గిందని దీనిలో భాగంగానే ఎగుమతులు బాగా మందగించాయంటూ వ్యాపారులు బహిరంగానే చెబుతూ ధరలను తగ్గించేస్తున్నారు.

వారంరోజుల క్రి తం 100 కౌంటు రొయ్యల ధరలు రూ. 240 ఉండగా ఇప్పుడు రూ.210, 90కౌంటు రొయ్యలు రూ.250 ఉండగా ప్రస్తుతం రూ.220కు కొనుగోలు చేస్తున్నారు. 80 కౌంటు రొయ్యల ధరలు వారం రోజుల క్రితం రూ.260 ఉండగా ఇప్పుడు రూ.230, 70 కౌంటు రొయ్యల ధరలు 270 ఉండగా ఇప్పుడు రూ.240లు, 60కౌంటు రొయ్యలు 320 ఉండగా ఇప్పుడు రూ.280కి కొనుగోలు చేస్తున్నారు. ఇలా అన్ని రకాల కౌంట్‌ రొయ్యలకు వారంరోజులకు ఇప్పుడు రూ.30 తేడా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *