కాబోయే ఆర్ టి ఐ కమిషనర్లు గా కట్టా తదితరులు??

మూడు అక్షరాల్లో చెబితే ఆర్టీఐ. విడదీస్తే సమాచార హక్కు చట్టం. దీన్ని ఎందుకు తీసుకొచ్చారో తెలిసిన ముచ్చటే. మరి.. అనుకున్న లక్ష్యం నెరవేరిందా? అన్న ప్రశ్నను సంధిస్తే.. సమాధానం రాలేని పరిస్థితి. కాకుంటే.. దీని పుణ్యమా అని అధికారపక్షం తనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న కొందరికి పదవులు ఇవ్వటానికి.. వారిని సంతోషపెట్టటానికి ఒక అవకాశం కలిగిందని చెప్పాలి.

తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ఐదుగురు ఆర్టీఐ కమిషనర్లను ఏర్పాటు చేయనున్నారు. ఎవరిని నియమించాలన్న దానికి సంబంధించి ఒక కమిటీని నియమించారు. అందులో ఎవరున్నారయ్యా అంటే.. మజ్లిస్ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. సీఎస్ సోమేష్ కుమార్. వీరంతా కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తమకొచ్చిన దరఖాస్తుల్నిపరిశీలించిన వారు ఐదుగురు పేర్లను ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఐదుగురి పేర్లలో కట్టా శేఖర్ రెడ్డి.. నారాయణ రెడ్డి.. సయ్యద్ ఖలీలుల్లా.. అమీర్.. గుగులోత్ శంకర్ నాయక్ లు ఉన్నారు. దాదాపుగా వీరి పేర్లే ఫైనల్ అవుతాయని చెప్పక తప్పదు. ఎందుకంటే.. కమిటీ సిఫార్సు చేసిన పేర్లను గవర్నర్ ఓకే చేయటానికే అవకాశం ఎక్కువని చెప్పాలి.

ఆసక్తికరమైన విషయం ఏమంటే ఈ ముగ్గురిలో ఇద్దరు కేసీఆర్ సొంత మీడియాకు చెందిన వారు కావటం. కట్టా శేఖర్ రెడ్డి ఎవరో కాదు.. నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. మరొకరు నారాయణరెడ్డి కూడా కేసీఆర్ కుటుంబానికి చెందిన టీ న్యూస్ చానల్ కు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరు కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు మాత్రమే కాదు.. నారాయణరెడ్డి అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రజ్యోతి పత్రిక తరఫున టీఆర్ ఎస్ బీట్ చూసిన రిపోర్టర్ అన్న విషయాన్ని మర్చిపోకూడదు. మిగిలిన ముగ్గురికి సంబంధించిన ఎంపిక సైతం ప్రత్యేకంగా జరిగిందేమీ లేదన్న మాట వినిపిస్తూ ఉంది. ఏమైనా.. సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా ఎవరు ఎంపిక అవుతున్నారో ఇప్పుడు అర్థమైందిగా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *