కోడి మాంసం తింటే కరోనా రాదు..

ఊ అన్నంతనే ఉలిక్కిపడే పరిస్థితి వచ్చేసింది. మామూలుగా ఉండే అనుమానాలకు సోషల్ మీడియా తోడు కావటం ప్రతి విషయంలోనూ సందేహమే. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా లాంటి వైరస్ వచ్చి పడితే ఉండే భయాలు అన్ని ఇన్ని కావు. చైనాలో అది.. ఇది అన్న తేడా లేకుండా గబ్బిలాలు కూడా తినేయటం వల్లనే ఈ మాయదారి వైరస్ వచ్చిందన్న మాట వైరల్ గా మారటం.. ఈ వైరస్ కు దూరంగా ఉండాలంటే నాన్ వెజ్ విషయం లో కాస్త ఆచితూచి అన్నట్లుగా ఉంటే మంచిదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ ప్రచారంలో నిజం ఎంతన్నది పక్కన పెడితే.. భయపడేవాళ్లను ఎంత భయపెట్టాలో భయపెట్టేస్తున్న ఇవాల్టి రోజుల్లో నాన్ వెజ్ తినే విషయంలో జాగ్రత్త పెరిగింది. ఫలితంగా అమ్మకాలపై ప్రభావం చూపించటమే కాదు.. ఆ రంగం తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి. ఇలాంటి వేళ.. చికెన్ తింటే కరోనా ముప్పు ఉందా? అన్న సందేహాలకు తెర దించేస్తూ కేంద్ర పశు సంరక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టమైన ప్రకటన ను విడుదల చేసింది.

కోడిమాంసం తింటే ఏమీ కాదని.. సేఫ్ అన్న విషయాన్ని తేల్చేసింది.జంతువులు.. పక్షుల నుంచి కరోనా విస్తరిస్తోందన్న కథనాల మీద సదరు శాఖ స్పందిస్తూ.. కోడి మాంసం.. ఇతర పౌల్ట్రీ ఉత్పత్తులు తినటంతో కరోనా సోకదని చెప్పిన కేంద్ర పశు సంరక్షణ శాఖ కమిషనర్ డాక్టర్ ప్రవీణ్ మాలిక్.. ఇలాంటి ప్రచారాల్ని అస్సలు నమ్మొద్దని.. దీనికి శాస్త్రీయ ఆధారం లేదని తేల్చేశారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం పరిశుభ్రత.. నాణ్యమైన ఆరోగ్య ప్రమాణాలు పాటించటం తో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని.. అంతేకానీ చికెన్ తో ఎలాంటి సమస్యా ఉండదని తేల్చేశారు. సో.. ఇంతకాలం కరోనా అనుమానాలతో చికెన్ ను దూరం పెట్టినోళ్లు.. ఆ అనుమానాన్ని పక్కన పెట్టేయొచ్చు సుమా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *