క్రిస్‌ లిన్‌ నెత్తిపై పొగలు

ఆస్ట్రేలియా విధ్వసంకర క్రికెటర్‌ క్రిస్‌ లిన్‌కు కోపం వచ్చింది.. మైదానంలోనే సహచర ఆటగాళ్లపై మండిపడ్డాడు.. ఆ వెంటనే అతడి నెత్తిపై నుంచి పొగలు వచ్చాయి. ఈ విచిత్ర ఘటన పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో కనిపించింది. శుక్రవారం రావల్పిండి వేదికగా పెషావర్‌ జల్మి-లాహోర్‌ ఖలందర్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో క్రిస్‌ లిన్‌ నెత్తిపై పొగలు రావడం ప్రస్తుతం సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అయితే కొందరు ఫ్యాన్స్‌ అవాక్కవుతుండగా.. మరికొందరు కెమెరా జిమ్మిక్కు కావచ్చని అనుమానిస్తున్నారు. అయితే కెమెరా పనితనం ఏమి లేదని, పొగలు వచ్చిన మాట వాస్తవమని, దానికి కారణాలు తెలియవని ఈ విచిత్ర ఘటనను ప్రత్యక్షంగా వీక్షించిన ఓ అభిమాని పేర్కొన్నాడు.
ఇక ఈ మ్యాచ్‌లో క్రిస్‌ లిన్‌ ప్రాతినిథ్యం వహించిన లాహోర్‌ ఖలందర్స్‌ జట్టు 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పెషావర్‌ జట్టు 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. అయితే బౌలర్ల పేలవ ప్రదర్శనపై క్రిస్‌ లిన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలోనే అతడి నెత్తిపై పొగలు వచ్చాయి.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లాహోర్‌ జట్టు 6 వికెట్లు కోల్పోయి 116 పరుగులే సాధించి ఓటమి పాలైంది. ఇక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో క్రిస్‌ లిన్‌ మెరుపుల గురించి తెలియన వారు ఉండరు. గత సీజన్‌ వరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరుపున ఆడిన ఈ విధ్వంసకర ఆటగాడు.. రానున్న సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ తరుపున ప్రాతినిథ్యం వహించనున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *