గవర్నర్ చెంతకు ఎలక్షన్ పంచాయతీ

ఏ పి రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ప్రభుత్వం భగ్గుమంటోంది.విచక్షణాధికారాల్ని ఉపయోగించి తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఎలక్షన్ అధికారి రమేష్ కుమార్ చెప్పడంతో… సీఎం జగన్ మోహన్ రెడ్డి చాలా సీరియస్‌గా ఉన్నారు. ఈమధ్య ప్రతీ ఒక్కరికి విచక్షణాధికారం అనే పదం వాడటం ఫ్యాషనైపోయిందని మండిపడ్డారు.

రమేష్ కుమార్… టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన వైసీపీ… దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపింది. ఈ పరిస్థితుల్లో… గవర్నర్ విశ్వభూషణ్‌తో ఇవాళ ఎస్ఈసీ రమేష్ కుమార్ భేటీ జరగబోతోంది. ఆల్రెడీ ఎస్ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ… సీఎం జగన్… ఆదివారమే గవర్నర్‌ని కలిసి కంప్లైంట్ చేశారు.

ఈ విషయాన్ని పరిశీలిస్తానన్న గవర్నర్… వివరణ ఇవ్వాల్సిందిగా రమేష్ కుమార్‌ను కోరినట్లు తెలిసింది. అందువల్ల ఇవాళ ఉదయం గవర్నర్‌ని కలిసి రమేష్ కుమార్ ఏం చెబుతారు, ఏ రిపోర్ట్ ఇస్తారు, ఎలా తన నిర్ణయాన్ని సమర్థించుకుంటారన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

ఎస్ఈసీ నిర్ణయం వల్ల అభివృద్ధి పనులు ఆగిపోతాయనీ, కరోనా వైరస్‌ను కట్టడి చేసే ఛాన్స్ లేకుండా పోతుందనీ, స్థానిక సంస్థలకు అందాల్సిన రూ.5000 కోట్ల నిధులు ప్రస్తుతానికి అందకుండా పోతాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. ఐతే… రమేష్ కుమార్ నిర్ణయం మరోలా ఉంది.

కరోనా వైరస్ దృష్ట్యా సమూహాలుగా ఉండొద్దని కేంద్ర ప్రభుత్వం సూచించడంతో… ఆ సూచనల ఆధారంగా… కరోనా వైరస్‌ని కట్టడి చేసే చర్యల్లో భాగంగానే ఎన్నికల్ని వాయిదా వేస్తున్నట్లు ఎస్ఈసీ తెలిపారు. ఎన్నికల్ని వాయిదా వేస్తే… స్థానిక సంస్థలకు తాము ఆదేశాలు ఇవ్వడం కుదరదనీ, తద్వారా కరోనాను కట్టడి చెయ్యడానికి మరింత సమస్య అవుతుందని ప్రభుత్వం అంటోంది. ఇలా రెండు విభిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ ఎన్నికల విషయంలో… టీడీపీ… మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ జారీ చెయ్యాలనీ, ఏకగ్రీవాల్ని కూడా రద్దు చేయాలని కోరుతోంది. పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేన పార్టీ కూడా ఇదే కోరిక కోరింది. బీజేపీ మాత్రం… ఎస్ఈసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపింది. ఇలా స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అంశం ఏపీ రాజకీయాల్ని కుదిపేస్తోంది. మరి సుప్రీంకోర్టు ఏం చెబుతుందన్నది తేలాల్సిన అంశం.

ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవడం వెనక ఓ బలమైన కారణం ఉన్నట్లు తెలిసింది. బ్యాలెట్ బాక్సులతో జరిపే ఈ ఎన్నికల్లో ఓటు వెయ్యడానికి ప్రజలు కాగితాలను వాడుతారు. కాగితాలపై కరోనా వైరస్ ఐదు రోజులు బతికి ఉంటుంది. అలాగే… బ్యాలెట్ బాక్సులు చెక్కవి అయితే… వాటిపై కూడా ఐదు రోజులు బతకగలదు. అలాగే ప్లాస్టిక్ వస్తువులపై కరోనా వైరస్ రెండు నుంచీ మూడు రోజులు జీవించి ఉండగలదు.

ఈ అంశాల్ని దృష్టిలో పెట్టుకొనే ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని తెలుస్తోంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు కూడా తెలియజేస్తారని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *