ఘనంగా ‘మెగాస్టార్‌ ది లెజెండ్‌’ పుస్తకావిష్కరణ

స్వశక్తితో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన.. ఎందరో యువ నటులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అలాంటి చిరంజీవి జీవితచరిత్రపై ‘మెగాస్టార్‌ ది లెజెండ్‌’పేరుతో సీనియర్‌ జర్నలిస్టు వినాయకరావు పుస్తకం రాశారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్లో ఘనంగా జరిగింది.చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ ఈ పుస్తకాన్ని అవిష్కరించారు. ఈ సందర్బంగా రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. ‘నాన్న గురించి నాకు తెలిసింది తక్కువేనని అనిపించింది. ఈ బుక్‌ ద్వారా మా నాన్నకు ఇంకా ఎక్కువగా దగ్గర అవుతానని భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వినాయకరావుకు మా కుటుంబం, అభిమానులం రుణపడి ఉంటాం. చిన్నతనంలో నాన్నతో గడిపే అవకాశం తక్కువగా ఉండేది. నేను సినిమాల్లో వచ్చే సమయానికి నాన్న రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఆయన పడిన కష్టాలను ఎప్పుడూ దగ్గరగా చూడలేదు. కానీ ‘ఖైదీ నెంబర్‌ 150’ తో ఆయనలో కొత్త కోణం అర్థమైంది. ఈ సినిమా కోసం ఆయన పడ్డ కష్టాన్ని ప్రతి నిమిషం చూశాను. సైరా సినిమా కోసం రెమ్యూనరేషన్‌ తీసుకోకుండా 250 రోజులు కష్టపడి.. ఆయన మాకు ఇచ్చిన ఎనర్జీకి ధన్యవాదాలు. ప్రస్తుతం ఆయన మాతో ఎక్కువ సమయం గడపాలని చూస్తారు. అంతకు మించి ఆయన ఎక్కువగా ఏం ఆశించరు. ప్రతి ఒక్కరు తమ తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపండి. ఈ బుక్‌ గురించి చదివేటప్పుడు నాన్న గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను’ అని అన్నారు. ఈ కార్యక్రమానికి రామ్‌చరణ్‌తో పాటు అల్లు అరవింద్‌, రాఘవేంద్రరావు, సుబ్బిరామిరెడ్డి, వీవీ వినాయక్‌, మురళీ మోహన్‌ ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు చిరంజీవితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అలాగే చిరంజీవి మంచితనాన్ని, కష్టపడేతత్వాన్ని కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *