జగన్ కొత్త ప్రయోగం..ఏపీలో కొత్త నీరు

ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… తన పాలనలో సరికొత్త నిర్ణయాలతో దూసుకెళుతున్నారనే చెప్పాలి. గత ప్రభుత్వాలకు మాదిరిగా పాత చింతకాయ పచ్చడి నిర్ణయాలను పక్కనపెట్టేస్తూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్న జగన్… పాలనలో తనదైన శైలి నిర్ణయాలు వాటి అమలుకు శ్రీకారం చుట్టేశారు. కాంట్రాక్టుల విషయంలో రివర్స్ టెండరింగ్ అంటూ సరికొత్త ప్రయోగాన్ని చేసి రాష్ట్ర ఖజానాకు పెద్ద ఎత్తున మిగులును చూపుతున్న జగన్… తాజాగా మరో సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. అందులో భాగంగా బుధవారం తనను కలిసిన ఇజ్రాయెల్ కంపెనీ ఐడీఈ టెక్నాలజీస్ డిప్యూటీ సీఈఓ లీహి టోరెన్స్టైన్ ఇతర ప్రతినిధులకు జగన్ కీలక సలహాలు ఇవ్వడంతో పాటుగా సదరు కొత్త నిర్ణయం అమలు బాధ్యతను కూడా వారిపైనే పెట్టేశారు.

సరే… మరి జగన్ తీసుకున్న కొత్త నిర్ణయం ఏమిటన్న విషయానికి వస్తే… జగన్ తీసుకున్న తాజా నిర్ణయం అమలైతే రాష్ట్రానికి డీశాలినేషన్ వాటర్ అందుబాటులోకి వస్తుంది. ఈ నీరు ఎంట్రీతో లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ కంపెనీ ప్రతినిధులతో భేటీ సందర్భంగా జగన్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. మంచి నీటిని ఒక్క బొట్టు కూడా వృథా చేయకూడదని జగన్ తెలిపారు. అందుకోసమే డీశాలినేషన్ నీటిపై దృష్టిపెట్టామని ఆయన అన్నారు. ఇజ్రాయెల్ మొత్తం డీశాలినేషన్ నీటినే వినియోగిస్తోందని సీఎం గుర్తు చేశారు. పారిశ్రామిక అవసరాలకు డీశాలినేషన్ నీటినే వినియోగించాలన్నారు. అవసరమైన పక్షంలో తాగునీటి అవసరాలకోసం కూడా వినియోగించే పరిస్థితి ఉండాలని ఆయన తెలిపారు. ఆ మేరకు డీశాలినేషన్ ప్లాంట్ను అప్గ్రేడ్ చేసుకునేట్టు ఉండాలన్నారు. ఎక్కడెక్కడ డీశాలినేషన్ ప్లాంట్లు పెట్టాలి అన్నదానిపై అధ్యయనం చేసి ఆ మేరకు నివేదికలు ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులను సీఎం జగన్ కోరారు.

మొదటగా విశాఖపట్నంతో ప్రారంభించి దశలవారీగా దానిని విస్తరించుకుంటూ వెళ్లాలని సీఎం జగన్ అన్నారు. విశాఖపట్నం తడ కృష్ణపట్నం తదితర ప్రాంతాల్లో డీశాలినేషన్ నీటినే వినియోగించేలా చూడాలన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు డీశాలినేషన్ లేదా శుద్ధిచేసిన నీటినే వాడాలని సూచించారు. అలాగే రాష్ట్రంలోని థర్మల్ ప్లాంట్లు కూడా డీశాలినేషన్ నీటిని వినియోగించేలా ప్రణాళిక తయారు చేయాలని అధికారులకు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న మురుగునీటి శుద్దికి అవుతున్న ఖర్చు టెక్నాలజీ పైన కూడా దృష్టిపెట్టాలన్నారు. డీశాలినేషన్ ప్లాంట్ల సాంకేతికత – నిర్వహణ – ఖర్చులపై సమగ్ర వివరాలను ఇవ్వాలని సీఎం జగన్ ఐడీఈ టెక్నాలజీస్ ప్రతినిధులను కోరారు. విశాఖపట్నం సహా ఆయా ప్రాంతాలను పరిశీలించి ఆ మేరకు నివేదికలు రూపొందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. పరిశ్రమలకు ఏ ప్రమాణాలతో నీరు కావాలో నిర్ణయించి ఆ మేరకు డీశాలినేషన్ అవుతున్న ఖర్చు నిర్వహణ తదితర అంశాలన్నీ నివేదికలో పొందుపరచాలని జగన్ సదరు కంపెనీ ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *