జగన్ సంచలనం… బాబు నిర్ణయాలపై సిట్

వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఇప్పటిదాకా జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాలన్నింటి కంటే మరింత సంచలన నిర్ణయమనే చెప్పాలి. ఇంతటి సంచలన నిర్ణయంగా పరిగణిస్తున్న ఈ నిర్ణయం దేనికోసమన్న విషయానికి వస్తే… టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నవ్యాంధ్ర సీఎంగా కొనసాగిన ఐదేళ్ల కాలంలో తీసుకున్న అన్ని నిర్ణయాలపై దర్యాప్తు చేయడంతో పాటు అవసరమైతే అప్పటికప్పుడు కేసులు కూడా నమోదు చేసే ఉద్దేశంతో ఏకంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయడమే. ఇంటెలిజెన్స్ డీఐజీగా ఉన్న కొల్లి రఘురామిరెడ్డి నేతృత్వంలో రంగంలోకి దిగనున్న ఈ సిట్ లో మరో పది మంది పోలీసు అధికారులను జగన్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు జీవో ఆర్టీ నెంబరు 344ను శుక్రవారం రాత్రి జారీ చేసింది.
ఈ సిట్ కు జగన్ సర్కారు చాలా కీలక బాధ్యతలను అప్పగించడం తో పాటుగా దర్యాప్తు పరిధిపైనా పూర్తి స్వేచ్ఛను ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు హయాంలో టీడీపీ సర్కారు తీసుకున్న దాదాపుగా అన్ని నిర్ణయాలను సిట్ దర్యాప్తు చేయవచ్చట. అంటే ఏదో అలా అమరావతి భూముల కేటాయింపు నిధుల వెచ్చింపు తదితరాలపై వచ్చిన ఆరోపణలే కాకుండా.. సిట్ కు ఏ విషయం లో అనుమానం వచ్చినా దానిపై దర్యాప్తు చేసే హక్కును జగన్ సర్కారు కల్పించింది. అంతేకాకుండా ప్రభుత్వంలోని ఏ విభాగం నుంచి అయినా సిట్ సమాచారాన్ని సేకరించవచ్చట. ఏ ఫైల్ ను అయినా తనిఖీ చేయవచ్చట. మొత్తంగా చెప్పాలంటే… ఈ సిట్ దర్యాప్తు పరిధిలోని ప్రభుత్వంలోని అన్ని శాఖలు వచ్చేసినట్టే. అదే విషయాన్ని స్పష్టం చేస్తూ జగన్ సర్కారు… సిట్ కు అన్ని శాఖలు కూడా సహకరించాల్సిందేనని ఏ సమాచారం అడిగినా ఇవ్వక తప్పదని కఠిన ఆధేశాలు జారీ చేసింది.

ఇక ఈ సిట్ కు ఇంటెలిజెన్స్ డీఐజీ కొల్లి రఘురామ్ రెడ్డి నేతృత్వం వహించనుండగా… సిట్ లో నియమించిన రఘురామ్ రెడ్డి సహా 10 మంది అధికారులను కూడా పేర్కొంటూ సదరు జీవోను జారీ చేసింది. రఘురామ్ రెడ్డి కింద ఈ సిట్ లో పనిచేయనున్న అధికారులు ఎవరన్న విషయానికి వస్తే… ఐపీఎస్ అధికారి అట్టాడ బాబూజీ (విశాఖ ఎస్పీ) సీహెచ్ వెంకటఅప్పలనాయుడు (ఇంటెలిజెన్స్ ఎస్పీ) శ్రీనివాస రెడ్డి (కడప అదనపు ఎస్పీ) జయరామరాజు (ఇంటెలిజెన్స్ డీఎస్పీ) విజయ భాస్కర్ (విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీఎస్పీ) గిరిధర్ (ఇంటెలిజెన్స్ డీఎస్పీ) కెన్నడీ (ఏలూరు రేంజి ఇన్ స్పెక్టర్) శ్రీనివాసన్ (నెల్లూరు జిల్లా ఇన్ స్పెక్టర్) రాజశేఖరరెడ్డి (గుంటూరు జిల్లా ఇన్ స్పెక్టర్)లు సిట్ లో పనిచేయనున్నారు. వీరిలో బాబూజీ వెంకటఅప్పలనాయుడులు ఐపీఎస్ అధికారులు కాగా…మిగిలిన రాష్ట్ర సర్వీసులకు చెందిన వారే.

ఇక చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాల్లోని లోపాలను గుర్తించేందుకు జగన్… ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలో పలువురు మంత్రులతో కలిపి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కేబినెట్ సబ్ కమిటీ బాబు సర్కారు తీసుకున్న పలు కీలక నిర్ణయాలను పరిశీలించి వాటిలోని లోటుపాట్లు తప్పులను గుర్తిస్తూ ఇప్పటికే ప్రభుత్వానికి ఓ మధ్యంతర నివేదికను అందజేసింది. సదరు నివేదికను కూడా సిట్ పరిశీలించనుంది. అంతేకాకుండా కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చే సూచనలు సహాలపైనా సిట్ చర్యలు చేపట్టనుంది. అంతేకాకుండా తన విధి నిర్వహన లో భాగంగా సిట్ రాష్ట్రంలోని ఎవరినైనా ఎప్పుడైనా పిలిచి దర్యాప్తు చేసే అవకాశం ఉందట. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులపై కేసులు నమోదు చేయడమే కాకుండా… వాటికి బాధ్యులుగా తేలిన వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పక తప్పదు. ఈ సిట్ రంగంలోకి దిగితే… చంద్రబాబు అండ్ కోకు బ్యాండ్ బాజానే అన్న వాదన వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *