టీఎంసీ నుంచి పెద్దల సభకు ప్రశాంత్‌ కిషోర్‌!

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్‌ ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఆయన పెద్దల సభకు ఎన్నికవుతారనే ఊహాగానాలు ఢిల్లీ రాజకీయాల్లో బలంగా వినిపిస్తున్నాయి. బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) నుంచి ప్రశాంత్‌ కిషోర్‌ను రాజ్యసభకు నామినేట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లోని 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిలో టీఎంసీకి చెందిన నలుగురు సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అయితే బెంగాల్‌ అసెంబ్లీలో బలం ఆధారంగా ఆ నాలుగు స్థానాలకు తిరిగి టీఎంసీ కైవసం చేసుకోనుంది.

ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ నాయకత్వాన్ని ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన నేతలను రాజ్యసభకు పంపాలని మమత భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దేశ రాజకీయాల్లో బీజేపీ వ్యతిరేకులుగా ప్రత్యేక గుర్తింపు సాధించిన ప్రశాంత్‌ కిషోర్‌ పెద్దల సభకు నామినేట్‌ చేయాలని దీదీ నిర్ణయించినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద చట్టాలపై ప్రశాంత్‌ కిషోర్‌ బహిరంగానే విమర్శలకు దిగుతోన్న విషయం తెలిసిందే. దీని కారణంగానే జేడీయూ నుంచి ఆయన బహిష్కరణకు గురయ్యారు. ఈ పరిణామాలన్నీ మమతకు అనుకూలంగా ఉండటంతో.. టీఎంసీ తరఫున పీకేను రాజ్యసభకు పంపాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీనిలో భాగంగానే పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం జడ్‌ కేటగిరీ భద్రత కల్పించనుందని సమాచారం.

కాగా ప్రశాంత్‌ కిషోర్‌ ఇప్పటికే మమతకు రాజకీయ సలహాదారుడిగా సేవలందించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. రానున్న బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ విజయమే ధ్వేయంగా పీకే సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. దీంతో పీకేను పెద్దల సభకు పంపితే పార్టీకి మరింత బలం చేకూరే అవకాశం ఉందని దీదీ భావిస్తున్నారు. మరోవైపు బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. ప్రశాంత్‌ రాజకీయ భవిష్యత్‌పై ఆసక్తి నెలకొంది. ఈ వార్తలపై ఇరువురి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హం. కాగా మార్చి 26న రాజ్యసభకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *