టీడీపీ అడ్డుకున్న పదిశాతం రిజర్వేషన్లు పార్టీ ద్వారా ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం

టీడీపీ అడ్డుకున్న పదిశాతం రిజర్వేషన్లు పార్టీ ద్వారా ఇవ్వాలని నిర్ణయం..సీఎం జగన్‌ నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు.ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిచడం చట్ట విరుద్ధమని హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం నిర్ణయించిన 34 శాతానికి బదులుగా.. బీసీలకు 24 శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలుకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 10 శాతం సీట్లు పార్టీ తరుపున ఇవ్వాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. టీడీపీ కోర్టుకు వెళ్లి అడ్డుకున్న 10 శాతం పదవులను పార్టీ బీ ఫామ్‌ల ద్వారా అదనంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు మొత్తం 34 శాతం రిజర్వేషన్లు పొందనున్నారు.

ఈ మేరకు పార్టీ నిర్ణయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ పార్టీ నేతలతో కలిసి శనివారం వెల్లడించారు. సీఎం జగన్ నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం, బీసీలకు 34 శాతం.. మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 డిసెంబర్‌ 28న ప్రభుత్వం జీవో 176ను జారీ చేసిన విషయం తెలిసిందే. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న పంచాయతీరాజ్‌ చట్టంలోని పలు సెక్షన్లను సవాలు చేస్తూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సూచనల మేరకు టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డి, మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

ఆయా వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయస్థానం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టంలోని పలు సెక్షన్లను చట్ట విరుద్ధమని ప్రకటించింది. రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని, అలా జరగడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని స్పష్టం చేసింది. టీడీపీ నేతల కుట్ర కారణంగా బీసీలు తీవ్ర నిరాశ చెందారు. ఈ నేపథ్యంలోనే వెనుకబడిన బీసీలకు అన్యాయం జరగకుండా ఉండాలని సుధీర్ఘ ఆలోచన చేసిన సీఎం జగన్‌.. పార్టీ నుంచి అదనంగా 10శాతం సీట్లును బీసీలకు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ముందే సంకల్పించిన విధంగా బీసీలకు మొత్తం 34శాతం రిజర్వేషన్లు అమలుకానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *