ఢిల్లీ పీఠం ఈవీఎం లలో… ప్రశాంతంగా ముగిసిన పోలింగ్..

దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో సాయంత్రం 5.30గంటల సమయానికి 52.91శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 70 నియోజకవర్గాల్లో 672మంది అభ్యర్థుల భవితవ్యాన్ని దిల్లీ ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. అయితే, ఈసారి నమోదైన పోలింగ్‌ నమోదు విషయంలో మాత్రం కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. 2015 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ శాతాలతో పోలిస్తే ఈసారి ఇప్పటిదాకా నమోదైన పోలింగ్‌ శాతం తక్కువగా ఉంది. పోలింగ్‌ ప్రారంభమైన తొలి గంటలో కేవలం 4 శాతంగా నమోదైన పోలింగ్‌.. ఆ తర్వాత అదే రీతిలో మందకొడిగా కొనసాగినా అనంతరం మెరుగుపడింది. అయితే, సాయంత్రం 5.30గంటల సమయానికి 52.91 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఇటీవల అనేక ఆందోళనలకు వేదికయిన షహిన్‌బాగ్‌లో కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగింది. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 11న వెల్లడికానున్నాయి.

ఓటేసిన ప్రముఖులు..
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సతీ సమేతంగా ఓటు వేశారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, తన కుమార్తె ప్రియాంకా గాంధీ వాద్రాతో కలిసి వచ్చి ఓటేశారు. అలాగే, భాజపా అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, కేంద్రమంత్రులు జయశంకర్‌‌, హర్షవర్దన్‌, దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా,దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌‌, భాజపా ఎంపీలు పర్వేశ్‌ వర్మ, మీనాక్షి లేఖీతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

‘వంద’ దాటినా ఓటు స్ఫూర్తిని చాటారు!
శతాధిక వృద్ధులు సైతం ఓటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నా సామాన్యులు మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. ఉదయం పోలింగ్‌ కేంద్రాల వద్ద కోలాహలం కనిపించినప్పటికీ మధ్యాహ్నం తర్వాత అటు వైపు చూసేవారే కరవయ్యారు. చిత్తరంజన్‌ పార్కు వద్ద పోలింగ్‌ కేంద్రంలో 111 ఏళ్ల బామ్మ ఓటేయగా.. మరో పోలింగ్‌ కేంద్రం వద్ద 108 ఏళ్ల బామ్మ ఓటేసి ఆదర్శంగా నిలిచారు. అలాగే, చకార్‌పూర్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓ పెళ్లి కొడుకు తన కుటుంబ సమేతంగా పెళ్లి వస్త్రాలతో వచ్చి క్యూలైన్‌లో నిలబడి ఓటు విలువను చాటాడు.

ఎన్నికల విధుల్లో అధికారి మృతి
ఈశాన్య దిల్లీలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉదంసింగ్ అనే అధికారి గుండెపోటుతో మరణించారు. దిల్లీలో మొత్తం 13750 పోలింగ్‌ కేంద్రాల్లో జరిగిన పోలింగ్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా 90వేల మందితో భద్రత ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *