ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటిస్తారా?? కేజ్రీవాల్ సవాల్..

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ సోదిలో లేకుండాపోగా.. ఢిల్లీలో అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రంలో అధికార పార్టీ బీజేపీల మధ్యనే హోరాహోరీ పోరు నెలకొంది. ఇలాంటి తరుణంలో ఆప్ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్… బీజేపీకి ఓ సంచలన సవాల్ ను విసిరారు. దమ్ముంటే… 24 గంటలు గడిచేలోగా (బుధవారం 1 గంట లోగా) ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటిస్తారా? ఆ దమ్ము బీజేపీకి ఉందా? అంటూ కేజ్రీ విసిరిన సవాల్ నిజంగానే ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది.

ఢిల్లీ ఎన్నికల చరిత్రను చూస్తే… ఢిల్లీ సీఎం పీఠాన్ని బీజేపీ దక్కించుకుని చాలా ఏళ్లే అవుతోంది. వరుసగా మూడు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ డిల్లీ సీఎం పీఠాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలగా… కాంగ్రెస్ పార్టీ దివంగత సీఎం షీలా దీక్షిత్ పాలనకు చరమ గీతం పాడుతూ ఏడేళ్ల క్రితం ఢిల్లీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఢిల్లీలో శాంతి భద్రతల పర్యవేక్షణకు సంబంధించి కేంద్రంతో వచ్చిన విభేదాలతో 2014లో సీఎం పదవికి రాజీనామా చేసిన కేజ్రీ… 2015 ఎన్నికల్లో వరుసగా వరుసగా రెండో సారి కూడా బంపక్ మెజారిటీతో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తాను మరోమారు సీఎం అయ్యారు. ఈ దఫా కాస్తంత సంయమనంగానే వ్వవహరించిన కేజ్రీ… తాజాగా ఎన్నికల బరిలోకి పూర్తి ధీమాతో దిగారు. సర్వేలన్నీ మరోమారు ఆప్ దే గెలుపు అని కేజ్రీ మరోమారు సీఎం కావడం తథ్యమని చెప్పేశాయి.

  • ఈ క్రమంలో తన పార్టీ మేనిఫెస్టోను మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసిన సందర్భంగా కేజ్రీవాల్… తన వైరి వర్గం బీజేపీకి సంచలన సవాల్ ను విసిరారు. ఆప్ తరఫున సీఎం అభ్యర్థిని తానేనని మరి తనను ఓడిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్న బీజేపీ నుంచి సీఎం అభ్యర్థి ఎవరని ఆయన ప్రశ్నించారు. ఇప్పటిదాకా బీజేపీ తన సీఎం అభ్యర్థిని ప్రకటించేందుకే సాహసించలేదని ఎద్దేవా చేసిన కేజ్రీ… ఇప్పటికైనా మించిపోయింది లేదని దమ్ముంటే 24 గంటలు తిరిగేలోగా తన సీఎం అభ్యర్థి ఎవరో బీజేపీ చెప్పగలదా? అంటూ సవాల్ విసిరారు. మరి కేజ్రీ సవాల్ కు బీజేపీ గానీ ప్రధాని నరేంద్ర మోదీ గానీ సిద్ధమేనంటారో? లేదంటే… మునుపటిలాగే సైలెంట్ అయిపోతారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *