ఢిల్లీ లో నేడే పోలింగ్

వణుకు పుట్టించే చలిలో రాజకీయ వేడి రాజేసిన దిల్లీలో శనివారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2015 శాసనసభ ఎన్నికల్లో విపక్షాల్ని ‘చీపురు కట్ట’తో ఊడ్చేసిన సామాన్యుడు(ఆమ్‌ ఆద్మీ) ఇప్పుడు ఎలాంటి పాత్ర పోషిస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ ఐదేళ్ల పాలనకు మెచ్చి ప్రజలు తిరిగి అదే పార్టీకి పట్టం కడతారా? 2019 లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీలో క్లీన్‌స్వీప్‌ చేసిన భాజపా వైపు మొగ్గుచూపుతారా? మరో జాతీయ పార్టీ కాంగ్రెస్‌ను ఎంతవరకు ఆదరిస్తారు? సీఏఏకు వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో కొనసాగుతున్న నిరసనలు ఓటింగ్‌పై ఏ మేరకు ప్రభావాన్ని చూపుతాయి? ఈ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై ఎలాంటి ముద్ర వేస్తాయి? అనేవి ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశాలయ్యాయి.

బరిలో కాంగ్రెస్‌ బలహీన అభ్యర్థులు!
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ముందే కాడి జారేసిన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భాజపాను దెబ్బతీయడానికి పలు నియోజకవర్గాల్లో వ్యూహాత్మకంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)కి కాంగ్రెస్‌ పరోక్షంగా సహకరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌పై బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టిన కాంగ్రెస్‌ ఈ మారు అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలహీనమైన అభ్యర్థుల్ని బరిలో దించింది. 2019లో ఆప్‌ కంటే ఎక్కువ ఓట్లు సాధించిన నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్‌ గట్టి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీటిలో గాంధీనగర్‌, బాబర్‌పూర్‌, కరావల్‌ నగర్‌, శీలంపూర్‌, ముస్తఫాబాద్‌, చాంద్‌నీచౌక్‌, బల్లిమరాన్‌లాంటివి ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్‌ కూడా కొంత సొమ్ముచేసుకుంటే లాభపడొచ్చని భావించిన భాజపాకు ఈ పరిణామం మింగుడుపడడం లేదు. కాంగ్రెస్‌ బలహీన అభ్యర్థులున్న చోట ఆ పార్టీ సంప్రదాయ ఓటర్లు ఆప్‌కు అండగా నిలవొచ్చన్న భయం అక్కడి భాజపా అభ్యర్థులకు పట్టుకుంది.

కాంగ్రెస్‌ తిరోగమనం ఇలా…
షీలాదీక్షిత్‌ నేతృత్వంలో దిల్లీలో మూడు(1998, 2003, 2008) పర్యాయాలు అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఆ తర్వాత అధికారానికి దూరం కావడానికి అనేక కారణాలు. పార్టీ సీనియర్లు పలువురు దిల్లీలో, అటు కేంద్రంలో అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవడం కాంగ్రెస్‌ను దెబ్బతీసింది. 2013లో జరిగిన ఎన్నికల్లో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడింది. భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. కాంగ్రెస్‌ మద్దతుతో ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. అయితే ఆయన 49 రోజులే అధికారంలో ఉన్నారు. తిరిగి 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 సీట్లకు గాను 67 స్థానాల్లో ఆప్‌ విజయ దుందుభి మోగించింది. కాంగ్రెస్‌ 9.7 శాతం ఓట్లతో తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క సీటూ గెలవలేదు. షీలాదీక్షిత్‌ మరణం తర్వాత కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం లేకపోయింది. ఆమె తనయుడు సందీప్‌ దీక్షిత్‌ను కాంగ్రెస్‌ దాదాపుగా పక్కనబెట్టేసింది. అజయ్‌మాకెన్‌లాంటి వారు పెద్దగా ప్రభావం చూపే స్థితిలో లేరు. పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీల ప్రచారమూ అంతగా ఆకట్టుకోలేకపోతోంది. ఇవన్నీ కాంగ్రెస్‌కు ప్రతికూలాంశాలుగా పరిణమించాయి.

ముస్లింల ఓట్లు కీలకం
దిల్లీలోని 1.47 కోట్ల మంది ఓటర్లలో దాదాపు 13% పైగా ముస్లింలు. చాందినీచౌక్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో వీరి సంఖ్య 20% దాకా ఉండొచ్చు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో వీరు కాంగ్రెస్‌ పక్షాన నిలిచారు. ఈ మారు కూడా వీరి మద్దతును నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ షహీన్‌బాగ్‌ నిరసనలకు బహిరంగంగా మద్దతిస్తోంది. అయితే దిల్లీలో భాజపా అధికారంలోకి రాకుండా ఆపే సత్తా ఆప్‌కు మాత్రమే ఉందని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లింలు నమ్ముతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *