తిరుమలకు మెట్రోరైల్..

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్షదైవం కొలువై ఉన్న తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి ఏటా కోట్ల మంది వస్తుంటారు. అయితే తిరుమల కొండపైకి బస్సులు ఇతర వాహనాల్లోనే వెళ్లాలి. దాని వల్ల కొండపై విపరీతమైన కాలుష్యం రొద వ్యాపిస్తోంది.పైగా గంటన్నరకు పైగా ప్రయాణం. రైలు వంటి సదుపాయం ఉంటే తిరుమల కొండపై వాయు కాలుష్యం చాలా తగ్గుతుంది. శబ్ధ కాలుష్యం కూడా తగ్గుతుంది. కొండ పై ఉన్న జంతు జాలానికి ఇబ్బంది తప్పుతుంది. ఈ కోవలోనే ఆలోచించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇటీవల తిరుమల వేంకటేశ్వరుడి దర్శనం కోసం వచ్చిన హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆరాతీశారు. ఆయన ఇది సాధ్యమేనంటూ వివరించారు.

యూరప్ లోని ఆస్ట్రియాలో ఇలానే కొండలపైకి మోనో రైలు వేశారని.. అది ప్రపంచంలోనే అద్భుతమైన నిర్మాణమని.. తిరుమల కొండపైకి కూడా మోనో మెట్రో రైలు వేయవచ్చని తెలిపారు. దీనిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి కోరారు.
తాజాగా హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తిరుమలకు మెట్రో రైలుపై క్లారిటీ ఇచ్చారు. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి మెట్రో విషయంపై మూడు రోజులు సర్వే చేశామని తెలిపారు.

రిజర్వ్ ఫారెస్ట్ ఉన్న తిరుమల కొండపై రైలు నిర్మాణం చేయడానికి అనుమతులు కావాలని.. ప్రభుత్వాలు చొరవచూపితే తిరుమలకు మెట్రో రైలు జర్నీకి మంచి పరిష్కారం దొరుకుతుందని ఆయన అన్నారు. రైలు ప్రయాణంతో తిరుమలలో పొల్యుషన్ బాగా తగ్గుతుందని.. ప్రయాణం చాలా వరకు తగ్గుతుందని.. ప్రయాణికులకు వ్యయ ప్రయాసలు తగ్గుతాయని వివరించారు.

తిరుపతి టు తిరుమలకు మంచి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకొని తిరుమల ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకుంటే ప్రయత్నాలు మొదలుపెడుతామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *