దిశా నిందితుడి ఇంట్లో విషాదం.. చెన్నకేశవులు తండ్రి మృతి

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశా హత్యాచారం కేసుల నిందితుడు, ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన చెన్నకేశవులు ఇంట్లో విషాదం నెలకొంది. చెన్నకేశవులు తండ్రి కుర్మయ్య సోమవారం చనిపోయారు. గత ఏడాది డిసెంబరు 26న కుర్మయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. బైక్‌పై వెళ్తుండగా ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయపడిన కుర్మయ్య హైదరాబాద్‌లో కొన్ని రోజుల పాటు చికిత్స పొందారు. కొన్ని రోజుల క్రితమే కుటుంబ సభ్యులు ఆయన్ను స్వగ్రామం గుడిగండ్లకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇంట్లోనే కుర్మయ్య చనిపోయారు.

మూడు రోజుల క్రితం చెన్నకేశవులు భార్య రేణుక ఆడపిల్లకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. మార్చి 6న మహబూబ్ నగర్ ఆస్పత్రిలో ఆమె ప్రసవించింది. ఇంట్లో పాప పుట్టిన మూడు రోజులకే చెన్నకేశవులు తండ్రి కుర్మయ్య చనిపోయారు. ఇప్పటికే ఎన్‌కౌంటర్‌లో చెన్నకేశువులు చనిపోవడం, ఇప్పుడు కుర్మయ్య కూడా చనిపోవడంతో.. వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రేణుక భర్త చెన్నకేశువులు దిశా హత్యాచారం కేసులో ఏ2గా ఉన్నాడు. అతడి స్వస్థలం నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్ల గ్రామం. దిశా ఘటన సమయంలోనే ఆమె గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే.

నవంబరు 27న పశు వైద్యురాలు దిశ (పోలీసులు పెట్టిన పేరు)పై శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద గ్యాంగ్ రేప్ జరిగింది. అనంతరం ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసి.. షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి బ్రిడ్జి కింద తగులబెట్టారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రెండు రోజుల తర్వాత దిశ హత్యాచారం కేసులో నారాయణ పేట్ జిల్లా మక్తల్ మండలానికి చెందిన అరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు అరెస్ట్ అయ్యారు. ఐతే డిసెంబరు 6న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఈ నలుగురూ చనిపోయారు. విచారణలో భాగంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం వెళ్లిన సమయంలో పోలీసులపై దాడి చేయడంతో.. పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు నిందితులు చనిపోయారు. దీనిపై కేసు నమోదు కావడంతో అంత్యక్రియలు 17 రోజులు ఆలస్యమయ్యాయి. డిసెంబరు 6న ఎన్‌కౌంటర్ జరిగితే.. డిసెంబరు 23న నలుగురు నిందితుల అంత్యక్రియలు నిర్వహించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *