నిర్భయ దోషులకు చివరిచూపు అవకాశం

నిర్భయ కేసు దోషులు తమ కుటుంబాలను చివరి చూపు చూసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తిహాడ్‌ జైలు అధికారులు తెలిపారు. కేసులో దోషులుగా ఉన్న ముకేశ్‌సింగ్‌, వినయ్‌శర్మ, పవన్‌, అక్షయ్‌లను మార్చి 3న ఉదయం 6గంటలకు ఉరి తీయనున్నారు. ఉరిశిక్ష అమలుకు రెండు రోజుల ముందుగానే తలారిని పంపించాలని కోరుతూ ఉత్తర్‌ప్రదేశ్‌ జైలు అధికారులకు సైతం లేఖ రాశారు. కాగా.. ఫిబ్రవరి 1కి ముందే ముకేష్‌సింగ్‌, పవన్‌ చివరి చూపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అక్షయ్‌, వినయ్‌ కూడా తమ కుటుంబాలను చూస్తామని కోరినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. దోషుల్లో ఒకరైన వినయ్‌ ఫిబ్రవరి 16న జైలులోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు.
అయితే, దోషులకు ఉరిశిక్ష విధిస్తూ డెత్‌వారెంట్‌ జారీ చేయడం ఇది మూడోసారి. జనవరి 22న ఉరి తీయనున్నట్లు జనవరి 17న కోర్టు తొలుత తీర్పు వెలువరించింది. ఆ తర్వాత శిక్షను ఫిబ్రవరి 1కు వాయిదా వేసింది. మరోసారి ఫిబ్రవరి 17న విచారణ అనంతరం మార్చి 3న శిక్షను అమలు చేయాలని తీర్పునిచ్చింది. ఉరి శిక్ష అమలులో ఆలస్యం చోటుచేసుకోవడం నిర్భయ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారైనా దోషులను శిక్షించి తమకు న్యాయం చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *