నెల్లూరులో 14 కరోనా అనుమానిత కేసులు… థియేటర్ల మూసివేతకు ఆదేశం

జిల్లా కేంద్రమైన నెల్లూరు పట్ణంలో 14 అనుమానిత కేసులో ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. దీంతో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. ముఖ్యంగా, ఈ వైరస్ మరింత మందికి వ్యాపించకుండా ఉండేందుకు వీలుగా జిల్లా కేంద్రంలోని అన్ని థియేటర్లను మూసివేయాలని జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఆయన థియేటర్ల యజమానులతో చర్చలు జరిపారు. అలాగే, జిల్లా ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి, జిల్లాలో మరో మూడు ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు పట్టణంలోని చిన్నబజారుకు చెందిన 24 యేళ్ళ యువకుడికి కరోనా వైరస్ సోకింది. ఏపీలో నమోదైన తొలి కేసు ఇదే. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ యువకుడు వెళ్ళిన ప్రాంతాలు, కలుసుకున్న వ్యక్తులకు కూడా ఆరోగ్య శాఖ అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో మొత్తం 14 మందిని అనుమానితులుగా గుర్తించారు. వీరందరినీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.

ఇదిలావుండగా, ఈ వైరస్ మరింతమందికి వ్యాపించకుండా ఉండేందుకు వీలుగా సినిమా థియేటర్లు, హోటల్ యజమానులతో ప్రత్యేక సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఇందులో కొన్ని రోజుల పాటు థియేటర్లు మూసి వేయాలని ఆదేశించారు. అన్ని షాపింగ్ మాల్స్‌లో ప్రజలు మాస్క్‌లను ధరించేలా చూడాలని, ఈ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *