పరిపాలన వికేంద్రీకరణతోనే ప్రజలకు సత్వర సేవలు:ఎమ్మెల్యే అనంత

మంచి చేయడానికే ప్రయత్నించండి..పాజిటివ్‌ కోణంలో ఆలోచనలు చేయండి.అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి.పింఛన్ల వెరిఫికేషన్‌ పది రోజుల్లో పూర్తి చేయండి…

అర్హులకు అన్యాయం జరిగితే మీదే బాధ్యత..

‘‘మీరంతా ప్రజల కోసం నియమితులయ్యారు. వాళ్లకు ఎలా మేలు చేయాలో ఆలోచించండి. అంతేగానీ సంక్షేమ పథకాల నుంచి ఎలా తొలగించాలా? అని ఆలోచించొద్దు. బీ పాజిటివ్‌’’ అని అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. బుధవారం నగరంలోని అంబేడ్కర్‌ భవన్‌లో 25 డివిజన్ల పరిధిలోని వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే అనంత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఒక వైపు ప్రభుత్వ నిబంధనలు, వాటిలో వచ్చిన మార్పులను వాలంటీర్లు సరిగా తెలుసుకోకపోవడం వల్ల నగరంలో సుమారు 5 వేల మందికి పింఛన్లు రాలేదన్నారు. 74 సచివాలయాల పరిధిలో పని చేసే ఉద్యోగలు, వాలంటీర్లు తక్షణం రూట్‌మ్యాప్‌ తయారు చేసుకుని అన్ని సంక్షేమ పథకాల అర్హుల వివరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ముందుగా వాలంటీర్లు తమ పరిధిలో ఎన్ని పింఛన్లు ఉన్నాయన్న వివరాలు సేకరించాలన్నారు. నగరంలో 22961 పింఛన్లు వచ్చేవని, కొన్ని కారణాల వల్ల ఫిబ్రవరి మాసానికి 17 వేలు మాత్రమే వచ్చాయన్నారు. సుమారు 5 వేల మందికి పింఛన్లు ఆగిపోయాయని, వాటిని తొలగించలేదన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. అవన్నీ వెరిఫికేషన్‌లో ఉన్నాయని స్పష్టం చేశారు. ఒకప్పుడు పింఛన్‌కు 750 చదరపు అడుగుల అర్హత ఉండేదని, కానీ ఇప్పుడు 1000 చదరపు అడుగులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎలక్ట్రిసిటీ బిల్లుల విషయంలోనూ కొన్ని సమస్యలు ఉన్నాయని, వాలంటీర్లు సమగ్రంగా పరిశీలించాలన్నారు. ప్రభుత్వం సడలించిన నిబంధనలను దృష్టిలో ఉంచుకుని పది రోజుల్లో వెరిఫికేషన్‌ పూర్తి చేసి సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ‘‘పింఛన్లు పొందుతున్న వారిలో కొందరు ఇళ్లు మారారు.. ఊర్లు కూడా మారారు. హిందూపురం, నల్లచెరువు వాళ్లు కూడా ఇక్కడ పింఛన్‌దారులుగా ఉన్నారు. దీనివల్ల కొన్ని సమస్యలు వచ్చాయి’’ అని అన్నారు. కొత్త రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ కూడా ప్రారంభమైందని, రేషన్‌కార్డులను విభజించి పింఛన్‌కు అర్హులుగా చేయాలన్నారు. 300 యూనిట్ల విద్యుత్‌ వినియోగానికి సంబంధించి ఆరు నెలల యావరేజ్‌ తీసుకోవాల్సి ఉంటుందని, ఈ విషయంపై విద్యుత్‌శాఖ అధికారులతో కూడా మాట్లాడతానని చెప్పారు. ఇవన్నీ కూడా నిబంధనలకు అనుగుణంగా చేసేవే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇలా చేయడం వల్ల చాలా మంది అర్హులు అవుతారన్నారు.

*పాలనా వికేంద్రీకరణతో సత్వర సేవలు*

  • దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారని, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం పరిపాలనను ఇంటి ముంగిటకు తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి చెప్పారు. పరిపాలన వికేంద్రీకరణతోనే ప్రజలకు సత్వర సేవలు అందుతాయన్నారు. సచివాలయ వ్యవస్థపై మొదట్లో కొందరు అవహేళన చేశారని, రిజర్వేషన్లు పాటించి నియామకాలు చేపట్టినట్టు స్పష్టం చేశారు. ఈ వ్యవస్థను విజయవంతం చేయాలన్నారు. ఎక్కడా అవినీతికి తావివ్వద్దని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటి వద్దకు తీసుకెళ్లడంలో సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లపై గురుతర బాధ్యత ఉందన్నారు.

*అర్హులకు రాకుంటే మీదే బాధ్యత*

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు రాకుంటే ఉద్యోగులు, వాలంటీర్లదే బాధ్యత అని ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు.‘‘బాధల్లో ఉన్న వారికి సాయం చేయండి. మీ పరిధి చాలా తక్కువగా ఉంటుంది. మీ ప్రాంతంలోని ప్రతి ఒక్కరికీ న్యాయం చేయండి. మీకు కేటాయించిన ఇళ్లలో వారిని మీ కుటుంబ సభ్యులుగా భావించి పని చేయండి. అర్హత లేకపోతే ఎవరు చెప్పినా వినద్దు’’ అని సూచించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఏ ఆశయం కోసం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారో దాన్ని మూడు నెలల్లో సాకారం చేయాలన్నారు. వ్యవస్థలో ఒక మార్పు తీసుకురావాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *