పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది :సీఎం జగన్

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో కొనసాగుతున్న అమరావతి పరిరక్షణ ఉద్యమం బుధవారానికి 50 రోజులకు చేరుకోనుంది. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని మూడు రాజధానుల మాట అస్సలే వద్దంటూ అక్కడి రైతులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి కీలక తరుణంలో అమరావతికి భూములిచ్చిన రైతులు… మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా రైతులతో జగన్ చాలా సేపే మాట్లాడారట. చర్చలో భాగంగా అమరావతిలో తమ ప్రభుత్వం చేయనున్న అభివృద్దిని రైతులకు జగన్ వివరించారట. భేటీ అనంతరం బయటకు వచ్చిన రాజధాని రైతులు… తమకు రాజధాని కంటే కూడా అభివృద్ధే ముఖ్యమని ముక్త కంఠంతో చెప్పేశారు. రాజధాని విషయం ఏమో గానీ… తమ ప్రాంతం అభివృద్దికి జగన్ గట్టి హామీ ఇచ్చారని రైతులు చెప్పారు.

రైతు కూలీలకు రూ. 2500 నుంచి 5 వేలు పెంచడంతో రైతులు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. గత పాలనలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయాలను రైతులు వివరించారు. భేటీ అనంతరం అమరావతి రైతులు మీడియాతో మాట్లాడారు. తమకు అండగా ఉంటామని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు. రైతులను సంప్రదించకుండా ఎలాంటి చర్యలు చెపట్టబోమని జగన్ చెప్పినట్లు వెల్లడించారు. ఐదేళ్లుగా చంద్రబాబు చేసిన అరాచకాలపై పోరాడుతున్నమని తమ వద్ద నుంచి భూములు బలవంతంగా లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములను లాక్కుని చంద్రబాబు అమ్ముకోవాలని ప్రయత్నించారని ఆరోపించారు. శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను గత ప్రభుత్వం పట్టించుకోలేదని… అధికార బలంతో టీడీపీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపించారు. పంట భూములను వదిలిపెట్టాలని వేడుకున్నా పట్టించుకోలేదన్న రైతులు… లాండ్ పూలింగ్ పేరుతో భూములు బలవంతంగా లాగేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ.. లాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ను విత్డ్రా చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రిజర్వ్ జోన్ కూడా ఎత్తివేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. రానున్న మూడు నెలల్లో మంగళగిరి అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. గత ఐదేళ్ల కాలంలో రైతులకు తీవ్ర నష్టం జరిగే విధంగా చంద్రబాబు వ్యవహరించారని విమర్శించారు. చంద్రబాబు ధనదాహాలకు వ్యతిరేకంగా మంగళగిరి తాడికొండ రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు ఆర్కే తెలిపారు. మొత్తంగా రాజధాని రైతుల పేరిట కొనసాగుతున్న ఉద్యమం ఓ వైపు కంటిన్యూ అవుతుండగానే… అదే రాజధాని రైతులు జగన్ తో భేటీ కావడం తమకు రాజధాని కంటే కూడా అభివృద్దే ముఖ్యమంటూ ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *