పేదలకు గుడ్ న్యూస్ :సీఎం జగన్

మార్చి 1న ఒకేసారి 60 లక్షల మంది లబ్దిదారులకు పెన్షన్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి… ఒక్క రోజులో ఏదైనా చెయ్యవచ్చనే కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆ క్రమంలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏంటంటే… పేదవాళ్లకు సొంత ఇల్లు కల్పించడమే లక్ష్యంగా… భారీ కార్యక్రమం చేపట్టబోతోంది. ఉగాది రోజున 26.6 లక్షల ఇళ్ల పట్టాలు పేదవాళ్లకు ఇవ్వబోతోంది. అంతేకాదు… వచ్చే నాలుగేళ్లలో 30 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించబోతోంది. అంటే 2024 నాటికి ఈ ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందన్నమాట. ఇదేమంత తేలికైన లక్ష్యం కాదు. చెప్పాలంటే ఇది సాధ్యం చేస్తే… అదో రికార్డే అవుతుంది. తాజాగా ఈ అంశంపై చర్చించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి… ప్రస్తుతం ఏపీలో పరిస్థితి ఎలా ఉంది, కేంద్ర… రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు ఎలా అమలవుతున్నాయి అన్నది తెలుసుకున్నారు. కేంద్ర పథకాల ద్వారా ఇంకా ఎన్ని ఇళ్లు రాష్ట్రానికి రావాలో తెలుసుకున్నారు. అలాగే కేంద్రం నుంచీ ఎన్ని నిధులు రావాలో కూడా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా… ఇళ్ల పట్టాలు పొందిన వారితోపాటూ… ఆల్రెడీ సొంతంగా స్థలం ఉన్న వారితోసహా ప్రభుత్వమే ఇళ్లు నిర్మిస్తుంది. అందువల్ల ఇళ్ల పట్టాలు పొందిన వారు… స్థలం దక్కినా… సొంత ఇల్లు కట్టుకోలేకపోతున్నామో అని ఆందోళన చెందాల్సిన పనిలేదు. ప్రభుత్వమే ఇల్లు కట్టి ఇచ్చేస్తుంది. ఈ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో 4500 మంది ఇంజినీర్లు పాల్గొనబోతున్నారు. అలాగే… 45000 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పాల్గొనబోతున్నారు.

ఇళ్లంటే ఏదో పైపైన కట్టేసి ఇవ్వకూడదనీ, చాలా క్వాలిటీతో, చక్కటి డిజైన్‌తో నిర్మించాలని సీఎం జగన్ సూచించారు. ఆల్రెడీ అధికారులు చూపించిన కొన్ని డిజైన్లకు కొన్ని మార్పులు సీఎం చెప్పారు. ప్రతీ ఇంట్లో బెడ్ రూం, కిచెన్, వరండా, టాయిలెట్ వంటివి ఉండేలా ఉండాలన్నారు. ఇల్లు కట్టిన తర్వాత.. ఆ ఇంటిపై రూ.25000 దాకా పావలా వడ్డీకే అప్పు ఇచ్చేలా బ్యాంకులతో మాట్లాడాలని సీఎం సూచించారు. మిగిలిన వడ్డీని ప్రభుత్వం ఇస్తుందన్నారు. అంతేకాదు… ఇళ్లు కట్టే ప్రాంతాల్లో చెట్లు, డ్రైనేజీలు, పార్కులు, కరెంటు, నీటి సరపరా అన్నీ ఉండేలా చెయ్యాలని అధికారులకు సీఎం జగన్ సూచనలు చేశారు. అందువల్ల ఈ ఏడాది ఉగాది పేదలకు నిజంగానే పండుగ అనుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *