ప్రధాని మోడీ తో భేటీ ఉద్దవ్ ఠాక్రే..

శివసేన అధినేత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆయన కుమారుడు మంత్రి ఆదిత్య ఠాక్రేలు శుక్రవారం మొదలెట్టిన హస్తిన టూర్ నిజంగానే పూర్తి కాంట్రాస్టుగానే సాగుతోందని చెప్పక తప్పదు. ఎందుకంటే… మొన్నటిదాకా తాను మిత్రపక్షంగా ఉండి ఇప్పుడు వైరి వర్గంగా మారిన బీజేపీ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అవుతూనే… మొన్నటిదాకా తనకు వైరివర్గంగా ఉండి ఇప్పుడు తనకు మిత్రపక్షంగా మారిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతోనూ ఆయన భేటీ అవుతున్నారు. ఇలా దేశ రాజకీయాల్లో ప్రధాన వైరివర్గాలుగా ఉన్న ఇరు పార్టీల నేతలను కలుస్తూ ఠాక్రే అందరి దృష్టినీ ఆకర్షించారు.

శనివారం ఢిల్లీ లో అడుగు పెట్టిన ఉద్ధవ్ ఠాక్రే తన కుమారుడిని వెంటేసుకుని ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ వద్దకే వెళ్లారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత శివసేన చీఫ్ హోదాలో తొలిసారిగా డిల్లీ వచ్చిన తర్వాత ఉద్ధవ్ నేరుగా మోదీ వద్దకు వెళ్లడం నిజంగానే ఆసక్తికరమేనని చెప్పాలి. ఎందుకంటే… మొన్నటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్కరికి మెజారిటీ రాని నేపథ్యంలో బీజేపీతో పాటు ఎన్సీపీ శివసేన ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు ఎవరికి వారుగా వ్యూహాలు నడిపారు. బీజేపీతో ఉన్న దోస్తీతో తానే సీఎం పీఠం ఎక్కేందుకు యత్నించిన ఉద్ధవ్… బీజేపీ కాదనేసరికి కాంగ్రెస్ ఎన్సీపీ తో జట్టు కట్టి సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు. వెరసి బేజీపీతో ఏళ్ల నాటి స్నేహాన్ని ఉద్ధవ్ రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మోదీతో ఉద్ధవ్ భేటీ ఆసక్తికరమేనని చెప్పాలి.

శనివారం ఢిల్లీలోనే ఉండనున్న ఉద్ధవ్ ఆదిత్యలు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాందీతోనూ ప్రత్యేకంగా భేటీ కానున్నారట. ఈ సందర్భంగా తనకు మద్దతిచ్చిన సోనియాకు ఉద్ధవ్ ప్రత్యేక కృతజ్జతలు చెబుతారట. ఇక ఆ తర్వాత మోదీ పక్కనపెట్టేసిన బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీతోనూ ఠాక్రేలు కలుస్తారట. అసలే తనను ధిక్కరించి కాంగ్రెస్ తో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఉద్ధవ్ అంటే ఓ రేంజిలో గుర్రుగా ఉన్న మోదీ… తాను పక్కనపెట్టేసిన అద్వానీని కూడా కలుస్తున్న శివసేనానిపై ఇంకే రేంజిలో కోపం పెంచుకుంటారోనన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *