బ్యాటింగ్ లో భారీ మార్పలు ::క్రికెట్ సారధి కోహ్లీ విరాట్

న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డేల్లో టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో భారీ మార్పులుంటాయని భారత సారథి విరాట్ కోహ్లీ తెలిపాడు. ఏడాది విరామం తర్వాత భారత సీనియర్‌ జట్టులోకి వచ్చిన పృథ్వీషా ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడని, సూపర్‌ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌ మిడిలార్డర్‌లో వస్తాడని కోహ్లీ స్పష్టం చేశాడు. ‘‘గాయంతో రోహిత్ అనూహ్యంగా వన్డే సిరీస్‌కు దూరమవ్వడం దురదృష్టకరం. మ్యాచ్‌లో అతడు ఎంత ప్రభావం చూపిస్తాడో అందరికీ తెలుసు. ప్రస్తుతం వన్డే సిరీస్‌లు మాకు ఎక్కువగా లేవు. అతడు కోలుకోవడానికి ఇదే సరైన సమయం. అయితే ఈ సిరీస్‌తో వన్డేల్లో ఓపెనర్‌గా పృథ్వీషా అరంగ్రేటం చేయనున్నాడు. కేఎల్‌ రాహుల్‌ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తాడు. మిడిల్‌లో అతడు అలవాటు పడాలని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నాడు.

‘‘వన్డేల్లో ఇటీవల ఆసీస్‌తో గొప్పగా పోరాడాం. తొలి మ్యాచ్ ఓడినా తిరిగి పుంజుకొని 2-1తో సిరీస్‌ కైవసం చేసుకున్నాం. ఈ విజయంతో మాలో మరింత విశ్వాసం పెరిగింది. మా ప్రణాళికలను అమలు చేస్తూ పాజిటివ్‌ క్రికెట్‌ ఆడాలని భావిస్తున్నాం. వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్‌ గట్టిపోటీనిస్తుందని తెలుసు. అయితే మేం ఫీల్డింగ్‌లో మరింత మెరుగవ్వాలి. గత సిరీస్‌లో (కివీస్‌ టీ20) పేలవంగా ఫీల్డింగ్‌ చేసినా టీ20ల్లో విజయం సాధించాం. కానీ వన్డేల్లో అలా కుదరదు, ఫలితాలు మారుతుంటాయి. మైదానంలో చురుకుగా ఉండటానికి ప్రయత్నిస్తాం. దీనిపై మరింత దృష్టిసారించాలి’’ అని కోహ్లీ తెలిపాడు.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కివీస్‌తో టీమిండియా రేపు తొలి మ్యాచ్‌ ఆడనుంది. రోహిత్‌ శర్మ గాయంతో జట్టుకు దూరమవ్వడంతో అతడి స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ ఎంపికయ్యాడు. కేఎల్‌ రాహుల్‌ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తాడని కోహ్లీ స్పష్టం చేయడంతో పృథ్వీషాతో కలిసి మయాంక్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన అయిదు టీ20ల సిరీస్‌ను భారత్‌ 5-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *