భారత్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ట్రంప్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా పలు కీలకమైన ఒప్పందాలు జరుగుతాయని ప్రచారం జరిగింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు – కీలకమైన ఆయుధాల సరఫరా – చికెన్ దిగుమతులపై సుంకం వంటి అంశాలపై పలు నిర్ణయాలు తీసుకుంటారని చర్చ జరిగింది. వీటిలో చికెన్ దిగుమతుల అంశంపై భారత్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండగా….ఈ పర్యటనలో ఆ ప్రస్తావన రాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అనుకున్న విధంగానే భారత రక్షణరంగానికి సంబంధించి ట్రంప్ తీపి కబురు చెప్పారు. ప్రపంచంలో తమ దేశానికి మాత్రమే పరిమితమైన అత్యంత శక్తిమంతమైన ఆయుధాలను భారత్కు ఇస్తామని ట్రంప్ ప్రకటించారు.

తన పర్యటనలో భారత్ కు ట్రంప్ అద్భుతమైన – అత్యంత శక్తిమంతమైన కానుక ఇచ్చారు. భారత్ తమకు అత్యంత ప్రియమైన దేశమని చెప్పిన ట్రంప్ ….అందుకు తగ్గట్లుగానే ఆయుధాల ఒప్పందం విషయంలో తన మాట నిలబెట్టుకున్నారు. మంగళవారంనాడు భారత్ తో 3 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలను కుదుర్చుకుంటామని ట్రంప్ చెప్పారు. అమెరికాతోపాటు భారత్ కూడా అతివాద ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని – ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడంలో భారత్ కు అండగా ఉంటామని ట్రంప్ ప్రకటించారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు తమ రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుదని చెప్పారు.

తన పాలనలో ఇస్లామిక్ అతివాద ఉగ్రవాదాన్ని అణచివేశానని – ఐఎస్ ను 100 శాతం నిర్మూలించానని ట్రంప్ అన్నారు. ఐఎస్ అధినేత అల్ బాగ్దాదీని హతమార్చడం ద్వారా ఉగ్రవాదులకు తమ దేశం గట్టి సంకేతాలను పంపిందని చెప్పారు. ప్రపంచంలోని కొన్ని అత్యుత్తమ ఆయుధాలు అమెరికాకు మాత్రమే సొంతమని – వాటిని మిత్రదేశం భారత్ కూ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పాక్ తో తమకున్న సంబంధాల నేపథ్యంలో సానుకూలంగా ఉగ్రవాద శిబిరాల నిర్మూలనకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. త్వరలోనే పాక్ ఉగ్రవాద శిబిరాలు లేకుండా చేస్తామని – భారత్ కు ఈ విషయంలో సహకరిస్తామని ట్రంప్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *