భార్య జీతం ఇవ్వలేదనీ.. నీచానికి దిగజారిన భర్త.. చివరకు కటకటాలు

కట్టుకున్న భార్య సంపాదించే నెల జీతం ఇవ్వలేదన్న అక్కసుతో ఓ శాడిస్టు భర్త అత్యంత నీచానికి దిగజారాడు. తన భార్యతో పాటు.. అత్త, మరదలు గురించి అసభ్యకరపోస్టులు పెడుతూ పైశాచిక ఆనందం పొందాడు. అతని వేధింపులు భరించలేని ఆ ముగ్గురు మహిళలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో అతని పాపాలకు అడ్డుకట్టపడింది. ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. ఇంతకీ ఈ నీచానికి పాల్పడింది ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కావడం గమనార్హం.

హైదరాబాద్ నగరంలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన ఓ యువతి ఏడాదిన్నర క్రితం తన సహచరుడిని ఇష్టపడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందే తన బాధ్యతల బరువు చెప్పి జీతంలో సగం తల్లి, చెల్లికి ఇస్తానని, అందుకు అంగీకరిస్తేనే పెళ్లని షరతు విధించింది. ‘నీకెలా నచ్చితే అలా చెయ్’ అంటూ ఉత్తముడిలా నటించాడు. తీరా పెళ్లయ్యాకగాని అతని అసల రూపం బయటపడలేదు.

పెళ్లయిన రెండు నెలలకే భర్తకు బెంగళూరుకు బదిలీకాగా, ఆరు నెలల తర్వాత ఆమెకు కూడా బదిలీ అయ్యింది. బెంగళూరులో కాపురం పెట్టాక అతని అసలు రూపం బయటపడడం మొదలైంది. జీతం అంతా తనకే ఇవ్వాలని, లేదంటే పరువు తీస్తానంటూ బెదిరించేవాడు. ఆమె బెదిరింపులకు లొంగక పోవడంతో ఆమె వ్యక్తిత్వాన్ని కించరపరిచే పనులు చేయడం మొదలు పెట్టాడు.

భార్య, స్నేహితులతో పలు సందర్భాల్లో తీసుకున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెడుతూ ‘వీరంతా దేశముదుర్లు’ అంటూ వ్యాఖ్యానించేవాడు. అలాగే, భార్య, అత్త, మరదలు ఫొటోలు పెట్టి ‘సాయంత్రం మీకు బోరు కొడుతోందా… వీరిని సంప్రదించండి’ అంటూ కింద రాసేవాడు. భార్య ఫేస్‌బుక్ ఖాతాలోనూ కించపరిచే విధంగా వ్యాఖ్యాలు రాసేవాడు. ఇవన్నీ భరించలేని ఆమె చివరికి సైబర్ పోలీసులను ఆశ్రయించడంతో అతని పాపం పండింది. ఆ ముగ్గురు మహిళల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. అరెస్టు చేసి జైల్లో పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *