మహా రాష్ట్రకు జగన్ ’దిశా‘ నిర్దేశం

దిశ చట్టాన్ని తీసుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ప్రశంసలు కురిపించారు. తమ రాష్ట్రంలోను ఇలాంటి చట్టాన్ని తీసుకు వస్తామని చెప్పారు. హోంమంత్రి నేతృత్వంలో మహారాష్ట్ర అధికారుల ప్రత్యేక బృందం గురువారం తాడపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు.

దిశ చట్టం గురించి అధ్యయనం చేసేందుకు వచ్చిన వారు.. ఈ చట్టానికి సంబంధించిన పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. జగన్తో భేటీ అయిన వారిలో మహా హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ – డీజీపీ సుబోత్ కుమార్ జైశ్వాల్ – అదనపు సీఎస్ తో పాటు మరో ఇద్దరు సీనియర్ అధికారులు ఉన్నారు. ఏపీ మంత్రులు మేకతోటి సుచరిత – తానేటి వనిత – డీజీపీ గౌతమ్ సవాంగ్ – ప్రభుత్వ కార్యదర్శి నీలం సహాని – దిశ స్పెషల్ ఆఫీసర్ దీపిక తదితరులు ఉన్నారు.మహిళలు – చిన్నారులపై జరిగిన అఘాయిత్యాలకు సంబంధించి కేసులు వేగవంతంగా పూర్తి చేసేందుకు దిశ చట్టాన్ని తీసుకు వచ్చారు. చట్టాన్ని తీసుకు వచ్చిన కొద్ది రోజుల్లోనే వైసీపీ ప్రభుత్వం దిశ పోలీస్ స్టేషన్స్ ను కూడా ఏర్పాటు చేస్తోందని అనిల్ దేశ్ ముఖ్ ప్రశంసించారు. కొత్త దిశా చట్టంపై ఏపీ ప్రభుత్వం నుండి తాము సమాచారాన్ని తీసుకున్నామని త్వరలో మహారాష్ట్రలో ఉద్ధవ్ ప్రభుత్వం ఇలాంటి చట్టాన్ని తీసుకు వస్తుందన్నారు.

దేశంలోనే దిశ చట్టాన్ని ఏపీ ప్రభుత్వం తొలిసారి తీసుకు వచ్చిందని దీని అమలుకు రూ.87 కోట్లు కేటాయించిందని మంత్రి సుచరిత చెప్పారు. దిశ చట్టం కింద 13 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళలు – పిల్లల కోసం కంట్రోల్ రూమ్ – వన్ స్టాప్ సెంటర్ ను ఏర్పాటు చేశామన్నారు. దిశ చట్టం అమలు కోసం ఒక ఐఏఎస్ – ఒక ఐపీఎస్ తో ఇద్దరు ప్రత్యేక అధికారులను అపాయింట్ చేసినట్లు సీఎస్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *