మార్చి 6 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు..పద్దుకి ముహూర్తం ఎప్పుడంటే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020 బడ్జెట్ సమావేశాలని నిర్వహించడానికి కసరత్తులు మొదలుపెట్టింది. మొదట్లో స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తరువాత బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని అనుకున్నప్పటికీ కూడా – స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల పై పెద్ద రచ్చ జరగుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 20వ తేదీన రిజర్వేషన్ల నోటిఫికేషన్ జారీచేసి.. మార్చి 15 వరకు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేయాలని సీఎం జగన్ భావించారు.

కానీ స్థానిక సంస్థల రిజర్వేషన్ పై ఫిబ్రవరి 27వ తేదీన తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. దీనితో ఈ ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో కుదిరేలా కనిపించడంలేదు. దీనితో ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే మార్చి 6వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. 6వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభించాలని ఆలోచనలో ఉంది.

ఇక సభలో గవర్నర్ ప్రసంగం తర్వాత సభను వాయిదావేసి.. మార్చి 9వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. శాసనసభలో ఆర్థికమంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి పద్దును ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్ను కురసాల కన్నబాబు ప్రకటిస్తారు. వీరిద్దరూ మండలిలోనూ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఇక ఈ బడ్జెట్ సమావేశాలపై మార్చి 4వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించి.. సమావేశాల తేదీని ఖరారు చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *