మూడు రాజధానుల పై స్పందించిన పీఎం మోడీ

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వైసీపీ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని చూస్తోంది. విశాఖ కేంద్రంగా పరిపాలన సాగించాలని సీఎం జగన్ భావిస్తున్నారు.

ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని అక్కడికి తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమరావతిని కాదని, వేరే చోట రాజధాని అవసరం లేదని పేర్కొంటున్నాయి. మూడు రాజధానుల నిర్ణయం కేంద్రం వద్దకు కూడా చేరింది. అయితే, ప్రధాని మోదీ ఈ అంశంపై స్పందించాలని చాలా మంది కోరుకున్నారు. కానీ.. ఇప్పటి వరకు ఆయన స్పందించలేదు.

తాజాగా, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఏపీలో మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావిస్తూ ఆ నిర్ణయంతో దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని.. 13 జిల్లాలు ఉన్న ఏపీ రాష్ట్రానికి 3 రాజధానులను అంగీకరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకునేలా చూడాలని కోరారు.

ఆ లేఖపై ప్రధాని మోదీ స్పందించారు. ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై రాసిన లేఖ తనకు అందిందని, దాన్ని పరిశీలిస్తున్నామని కనకమేడలకు ప్రధాని మోదీ చెప్పారు. కాగా, ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏపీ రాజధానులపై స్పందించని మోదీ.. టీడీపీ ఎంపీ లేఖకు బదులివ్వడం ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *