మైనారిటీలకు సీఎం జగన్ గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏ – ఎన్నార్సీలపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వాటిని వ్యతిరేకిస్తూ కేరళ – పంజాబ్ – మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానాలు కూడా చేశాయి. మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణాలో కూడా సీఏఏ – ఎన్నార్సీ వ్యతిరేక తీర్మానం చేస్తారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. పార్లమెంట్లో సిఏఏ బిల్లుకు వైసీపీ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో సీఏఏ – ఎన్నార్సీ – ఎన్ పీఆర్ ల అమలుపై ముస్లింలలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అయితే తాము మద్దతు తెలిపిన మాట వాస్తవమేనని కానీ రాష్ట్రంలో వాటిని అమలు చేయబోమని వైసిపి నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎన్ పీఆర్ చేపట్టబోతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్..మీడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ముస్లింల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్ పీఆర్ పై ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఎన్ పీఆర్ పై ఒక తీర్మానం చేయాలనుకుంటున్నానని సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఎన్ పీర్ లో పొందుపరచిన కొన్ని ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ లోని మైనారిటీ వర్గాల్లో అభద్రతా భావాన్ని కలిగిస్తున్నాయని అందుకే తమ పార్టీలో దీనిపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చామని జగన్ ట్వీట్ చేశారు. 2010 నాటి పరిస్థితులకు ఎన్ పీఆర్ ను తిరిగి మార్చాలని కేంద్రాన్ని కోరాలని భావిస్తున్నట్లు సీఎం జగన్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఈ అంశంపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం కూడా చేయాలనుకుంటున్నామని సీఎం జగన్ వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇదే విధంగా ప్రకటించారు. 2010 తరహాలో కేవలం కుటుంబ వివరాలు తీసుకోవడానికి తమకు అభ్యంతరం లేదని కానీ మత ప్రాతిపదికన ఎన్నార్సీకి అనుగుణంగానే ఎన్ పీ ఆర్ చేపడతామని అంటే ఊరుకోబోమని కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్ పీఆర్ ను వ్యతిరేకించడం…కేంద్రంతో ఢీకొట్టడమేనని ….జగన్ తీర్మానం చేస్తే కేంద్రంతో చిక్కులు తప్పవని …అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *