మోడీ భద్రతకు రోజు ఖర్చు 1.62 కోట్లు?

దేశంలో ఎస్పీజీ భద్రత పొందుతున్న ఒకే ఒక్క వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. మరి ప్రధాని భద్రత కోసం రోజుకు ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా..? అక్షరాలా రూ. 1.62కోట్లు.
దేశంలో ఎంతమందికి ఎస్పీజీ, సీఆర్పీఎఫ్‌ భద్రత కల్పిస్తున్నారని డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌ లోక్‌సభలో ప్రశ్నించారు. ఇందుకు కిషన్‌రెడ్డి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. అయితే ఇందులో ప్రధాని పేరును నేరుగా చెప్పకుండా దేశంలో ఒకే ఒక్క వ్యక్తి ఎస్పీజీ భద్రత పొందుతున్నారని వెల్లడించారు. ఇక 56 మంది వీఐపీలకు సీఆర్పీఎఫ్‌ భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు. అత్యధికంగా 3000 వేల మంది ప్రత్యేక కమాండోలున్న ఈ ప్రత్యేక రక్షణ బృందాని(ఎస్పీజీ)కి 2020-21 కేంద్ర బడ్జెట్‌లో నిధులు పెంచిన విషయం తెలిసిందే. గత బడ్జెట్‌లో ఎస్పీజీకి రూ. 540కోట్లు కేటాయించగా.. ఈ సారి దాన్ని రూ. 592.55 కోట్లకు పెంచారు. అంటే గతంతో పోలిస్తే దాదాపు 10శాతం పెంచారు.
అంతకుముందు ప్రధాని సహా గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురికి ఎస్పీజీ భద్రత ఉండేది. దీంతో ఎస్పీజీకి కేటాయించే నిధులను ఈ నలుగురి భద్రతకు సమానంగా ఖర్చుచేసేవారు. అయితే ఎస్పీజీ చట్టంలో మార్పులు చేస్తూ గతేడాది నవంబరులో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో గాంధీ కుటుంబ సభ్యులకు ఈ భద్రతను ఉపసంహరించారు. దీంతో ఈసారి బడ్జెట్‌లో ఎస్పీజీకి కేటాయించిన నిధులన్నీ ప్రధాని భద్రతకే వినియోగించనున్నారు. దాన్ని బట్టి చూస్తే ప్రధాని భద్రత కోసం గంటకు దాదాపు రూ. 6.75లక్షలు, రోజుకు దాదాపు రూ. 1.62కోట్లు ఖర్చు చేస్తున్నారన్నమాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *