యువతకు ఉద్యోగాలు ఎలా కల్పించాలో మాకు తెలుసు :బొత్స

వైకాపా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి విజయనగరం జిల్లా నుంచే ప్రారంభిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 24న జిల్లా పర్యటనకు సీఎం రానున్న దృష్ట్యా ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణితో కలిసి మంత్రి బొత్స ఉన్నతాధికారులతో సమీక్షించారు. ముందుగా సీఎం పర్యటించనున్న ప్రాంతాలు, సభా వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లాలోని ఎమ్మెల్యేలు, అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ.. సీఎం తొలిసారిగా జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదే విధంగా జిల్లాలో ఏర్పాటు చేసిన ‘దిశ’ పోలీసు స్టేషన్‌ను సీఎం ప్రారంభిస్తారని మంత్రి వివరించారు.

ఇదే సందర్భంలో తెలుగుదేశం చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రస్తావించారు. తెదేపా గత ఐదేళ్ల పాలనలో జిల్లాకు ఒక్క కొత్త పరిశ్రమ కూడా తేలేదని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు కూడా కల్పించలేదని మండిపడ్డారు. ప్రరిశ్ర మలు ఎలా తేవాలో, యువతకు ఉద్యోగాలు ఎలా కల్పించాలో వైకాపా ప్రభుత్వానికి తెలుసని వ్యాఖ్యనించారు. ప్రజా చైతన్య యాత్రతో ప్రజలను తెదేపా నాయకులు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి బొత్స మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *