యువ డాక్టర్ ఆత్మహత్య

వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. అయితే, వారి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. దీంతో హైదరాబాద్ ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత భార్యను తీసుకుని భర్త ఇంటికి వెళ్లాడు. కొద్ది రోజుల పాటువారిద్దరూ బాగానే ఉన్నారు. ఆ తర్వాత పుట్టింటికి వెళ్ళి వస్తానని భార్య చెప్పింది. దీంతో భర్త సమ్మతించాడు. పుట్టింటికి వెళ్లిన భార్య… తాను తిరిగి వచ్చేందుకు తల్లిదండ్రులు అంగీకరించడం లేదనీ వారు సమ్మతిస్తేనే వస్తానని చెప్పింది. దీంతో మనస్సు విరక్తి చెందిన ఆ భర్త మత్తు ఇంజెక్షన్ వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఓ యువ వైద్యుడు కావడం గమనార్హం. మృతుని భార్య కూడా ఓ వైద్యురాలే. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా రామకృష్ణాపురం, ఠాగూర్ నగర్‌లో జరిగింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఠాగూర్‌ నగర్‌కు చెందిన ఆగయ్య సింగరేణిలో పదవీ విరమణ చేశాడు. బతుకుదెరువు కోసం ఐదేళ్ల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి నగరానికి వచ్చాడు. కుత్బుల్లాపూర్‌ గాయత్రినగర్‌, పద్మావతి హోమ్స్‌ ఫ్లాట్‌ నంబర్‌ 304లో నివసిస్తున్నాడు. ఇతడికి నలుగురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు. నలుగురిలో చిన్నవాడైన దాసరపు సుభాష్ ‌(32) డాక్టర్‌ చదువును ఇటీవల పూర్తి చేశాడు.

ప్రస్తుతం సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గాంధీ ఆస్పత్రిలో చెవి, ముక్కు, గొంతు డాక్టర్‌గా పనిచేస్తున్న కేరళకు చెందిన డాక్టర్‌ నిత్యతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. 2017లో ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సుభాష్‌ ఉంటున్న ఇంటికి ఆమె అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేది.

పెళ్లి విషయం తల్లిదండ్రులతో చెప్పి వస్తానని నిత్య కేరళ వెళ్లింది. నెలలు గడుస్తున్నా తిరిగి రాలేదు. తమ తల్లిదండ్రులు ప్రేమ వివాహాన్ని అంగీకరించడంలేదని, వారు ఒప్పుకుంటేనే తిరిగి వస్తానని చెప్పినట్లు సమాచారం. దీంతో డాక్టర్‌ సుభాష్‌ మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లి తన గదిలో నిద్రపోయాడు.

శుక్రవారం ఉదయం డ్యూటీకి వెళ్లాల్సిన సుభాష్‌ రూమ్‌ నుంచి బయటకు రాలేదు. తల్లి మల్లమ్మ లేపడానికి ప్రయత్నించగా అపస్మారకస్థితిలో ఉన్నాడు. ఆందోళనకుగురైన కుటుంబసభ్యులు స్థానికంగా ఉన్న సృజన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. పేట్‌బషీరాబాద్‌ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న నిత్య తనను విడిచిపెట్టి వెళ్లి తిరిగి రాకపోవడంతో మనస్తాపం చెందిన సుభాష్‌ మత్తు ఇంజక్షన్‌ తీసుకొని చనిపోయినట్లు సమాచారం. పోస్టుమార్టం నివేదిక వస్తే అసలు విషయం తెలుస్తుందని పోలీసులు చెప్పారు. మృతుడి తండ్రి ఆగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *