రాంచరణ్ నక్సలైట్ పాత్ర.. !

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 152వ చిత్రం (ఆచార్య) కొరటాల శివ దర్శకత్వంలో శర వేగంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దేవాదాయ శాఖ భూముల కుంభకోణం నేపథ్యంలో కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. చిరు ఎండోమెంట్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో రామ్ చరణ్ సిద్ధు అనే నక్సలైట్ పాత్ర పోషిస్తున్న వార్త ఇప్పటికే వైరల్ అయ్యింది. దాదాపు 40 నిమిషాల పాటు ఆ పాత్ర సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ప్రచారం సాగుతోంది. తాజాగా చెర్రీ రోల్ క్రియేషన్ వెనక ఓ ఆసక్తికర సంగతి తెలిసింది.

చిరు మూవీలో నక్సలైట్ పాత్రను డిజైన్ చేయడం వెనక అసలు కారణం తాజాగా రివీలైంది. దర్శకుడు కొరటాలను నిర్మాత చరణ్ స్వయంగా కోరితేనే ఈ రోల్ డిజైన్ చేశారని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. అందుకు ఓ ప్రత్యేక కారణం ఉందిట. గతంలో బాబాయ్ పవన్ కళ్యాణ్ `జల్సా` చిత్రంలో నక్సలైట్ పాత్ర లో కనిపించిన సంగతి తెలిసిందే. నక్సల్ పాత్రలో సీరియస్ నెస్ చూపిస్తూనే.. ప్రకాష్ రాజ్ -పవన్ కాంబినేషన్ లో కామెడీని తెరపై చూపించారు త్రివిక్రమ్. ఆ పాత్ర స్ఫూర్తితోనే చరణ్ తన రోల్ 152లో ఇలా ఉంటే బాగుంటుందని కొరటాలకి ఇన్ పుట్ ఇచ్చాడుట. దాని ప్రకారమే కొరటాల ఆ రోల్ ని డిజైన్ చేసినట్లు సమాచారం.

ఇసుక మాఫియాతో మెగాస్టార్ తలపడే సీన్స్ ని గోదారి పరిసరాల్లో తెరకెక్కిస్తున్నారట. ఇక్కడ ఓ భారీ యాక్షస్ ఎపిసోడ్ ఉంటుందని ఇప్పటికే తెలిసింది. ఈ ఐడియా కూడా చరణ్ ఇచ్చినదేనట. గోదారి ఇసుక రీచ్ ల మధ్యలో ఓ ఫైట్ సీన్ క్రియేట్ చేస్తే బాగుంటుందని చరణ్ కోరితే కొరటాలకు అది నచ్చి చిరు 152లో ఆ సీన్ జోడించినట్లు చెబుతున్నారు. అంటే ఇక్కడ చరణ్ గోదారి సెంటిమెంట్ ని అనుసరిస్తున్నారన్నమాట. గతంలో `రంగస్థలం` లో ఓ మేజర్ షెడ్యూల్ రాజమండ్రి గోదావరి పరిసర ప్రాంతాల్లో షూట్ చేసిన సంగతి తెలిసిందే.ఆ సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. అందుకే మరోసారి చరణ్ రాజమండ్రిని.. గోదారిని నమ్ముకుంటున్నాడు అన్న టాక్ వినిపిస్తుంది. మరి కొరటాల స్క్రిప్ట్ లో చరణ్ కిరికిరి పై నిజం ఎంత అన్నది సినిమా చూస్తే కానీ చెప్పలేం. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్-కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *