రాజధాని అమరావతి పేరిట కుంభకోణానికి పాల్పడ్డారు :ఎంపీ మితున్ రెడ్డి

రాజధాని అమరావతి పేరిట కుంభకోణానికి పాల్పడ్డారని, ఆ ప్రాంతంలో టీడీపీ నేతలు 4 వేల ఎకరాలకుపైగా భూములు కొనుగోలు చేశారని వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌ రెడ్డి ఆరోపించారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆయన విమర్శలు, ఆరోపణలు చేశారు. అమరావతిలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 780 మంది.. కోట్లాది రూపాయలతో భూములు కొన్నారని, అదెలా సాధ్యమని ప్రశ్నించారు. సీఐడీ విజ్ఞప్తితో ఈడీ కూడా రంగంలోకి దిగిందన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని.. రూ.40 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులతో పాటు అదనంగా మరో రూ.20 వేల కోట్లు చెల్లించే భారం వైసీపీ ప్రభుత్వంపై పడిందని చెప్పారు. ప్రాజెక్టులపై రీటెండరింగ్‌కు వెళ్లామని.. తక్కువకే టెండర్లు ఖరారుచేశామని.. తద్వారా నిధులు ఆదా చేశామని తెలిపారు. పీపీఏలను జగన్‌ ప్రభుత్వం రద్దు చేయలేదని, ఈ అంశంపై కోర్టులు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల వల్ల ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని గతంలో కేంద్రం ప్రకటించిందని.. కానీ ఆ సిఫారసులతో ప్రత్యేక హోదాకు సంబంధం లేదని ఆర్థిక సంఘం స్పష్టం చేసిందన్నారు. ఎగ్జిక్యూటివ్‌ ఉత్తర్వులతో ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. రెవెన్యూ లోటు నిధులు కూడా ఇవ్వాలన్నారు. వెనుకబడిన జిల్లాలకు రెండేళ్లుగా నిధులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని విడుదల చేయాలని కోరారు.

పోలవరం ప్రాజెక్టు ఏడాదిలో పూర్తికాబోతోందని.. ప్రాజెక్టుకు కేంద్రం ప్రతి 15 రోజులకు ఒకసారి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, రామాయపట్నం పోర్టును అభివృద్ధి చేయాలని కోరారు. రాష్ట్రాలను విస్మరించి 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను రూపొందించడం సాధ్యం కాదన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) తాము కూడా మద్దతిచ్చామని, కానీ ప్రజలు వీధుల్లోకి వచ్చి దాన్ని వ్యతిరేకిస్తున్నారని, ఈ అంశాన్ని పరిశీలించి సమస్యను పరిష్కరించడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్‌పీఆర్‌లోని ప్రశ్నావళిని కేంద్రం పునఃసమీక్షించాలని, మైనారిటీల్లో నెలకొన్న అభద్రతాభావాన్ని తొలగించాలని మిథున్‌రెడ్డి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *