రాజ్యసభ సీటు మోపిదేవి కా ? పిల్లి సుభాష్ కా ?

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజ్యసభకు ఎవరిని ఎంపిక చేయబోతున్నారనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. వైసీపీలో ఈ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. మిగతా వారి సంగతి ఎలా ఉన్నా… మండలి రద్దుతో మంత్రి పదవులు కోల్పోనున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలో రాజ్యసభ సీటు ఎవరికి దక్కుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది. మొదట్లో ఈ ఇద్దరినీ జగన్ రాజ్యసభకు పంపిస్తారనే టాక్ వినిపించింది. అయితే తాజాగా వీరిలో ఒక్కరికే మాత్రమే ఛాన్స్ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ ఒక్కరు ఎవరనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.

వాస్తవానికి ఈ ఇద్దరు నేతలు గత ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. అయినా వీరిని జగన్ కేబినెట్‌లోకి తీసుకున్నారు. సుభాష్ చంద్రబోస్‌కు ఏకంగా ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. అయితే మండలి రద్దు నిర్ణయంతో వీరి భవిష్యత్తు ఏమిటనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వైసీపీకి దక్కబోయే నాలుగు ఎంపీ స్థానాలను సామాజికర్గాలను బేరీజు వేసుకుని భర్తీ చేయాలని భావిస్తున్న సీఎం జగన్… ఆ రకంగా బీసీలకు ఒకే ఒక్క సీటు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

అదే జరిగితే మండలి రద్దు కారణంగా మంత్రి పదవి కోల్పోయే ఇద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఆ ఒక్కరు ఎవరనే దానిపై వైసీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. జగన్ కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్‌కే రాజ్యసభ సీటు దక్కుతుందని కొందరు చెబుతుంటే… ఆ ఛాన్స్ జగన్‌కు అత్యంత నమ్మకస్తుడైన మోపిదేవికే దక్కుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే వీరికి రాజ్యసభ సీటు దక్కినా దక్కకపోయినా… రాష్ట్రస్థాయిలోనే వారికి మంచి నామినేటెడ్ పదవిని జగన్ ఇస్తారని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *