రెట్టింపు నగదు బదిలీ చేస్తామంటూ సైబర్‌ నేరస్థుల మాయాజాలం

‘‘సర్‌.. పేటీఎం ఈ-వ్యాలెట్‌ వినియోగిస్తున్న వారిని ప్రోత్సహించేందుకు డబుల్‌ ధమాకా అందిస్తున్నాం… కంపెనీ ఖాతాకు ఐదు రూపాయలు నగదు బదిలీ చేస్తే.. పది రూపాయలు వెంటనే పంపిస్తాం… వంద రూపాయలు పంపితే.. రూ.రెండు వందలు నగదు బదిలీ చేస్తాం… రోజుకు గరిష్ఠ పరిమితి రూ.30వేల వరకు మాత్రమే ఉంటుంది… ఆలస్యం చేయకుండా నగదు బదిలీ చేయండి… అనుమానం ఉందా… ఐదు రూపాయలు పంపించండి.’’
– అంతర్జాల ఆధారిత నగదు లావాదేవీలు, ఈ-వ్యాలెట్లు ఉపయోగిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్‌ నేరస్థులు తాజాగా సంధిస్తున్న అస్త్రమిది.

రెట్టింపు నగదు ఇస్తామంటూ ఆశ చూపించి… కొంత మొత్తాన్ని బాధితులకు పంపిస్తున్నారు. వెయ్యి రూపాయలు, రెండువేల రూపాయల వరకూ తిరిగి ఇచ్చిన తర్వాత రూ.10వేలు, రూ.20వేలు నగదు బదిలీ చేయించుకుని ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేస్తున్నారు. సైబర్‌ నేరస్థుల బారినపడిన బాధితులు పోలీసులను అశ్రయిస్తుండగా ఇవన్నీ వెలుగులోకి వస్తున్నాయి.పేటీఎం ప్రతినిధులమంటూ సైబర్‌ నేరస్థులు బాధితులను పరిచయం చేసుకుంటున్నారు.

బాధితుల పేర్లు, వివరాలు, ఫోన్‌ నంబర్లను సైబర్‌ నేరస్థులు సక్రమంగా చెబుతుండడంతో ఈ-వ్యాలెట్లు నిర్వహిస్తున్న వారు సైబర్‌ నేరస్థుల మాటలను విశ్వసిస్తున్నారు. పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌పే వంటి ఈ-వ్యాలెట్‌ సంస్థలు రాయితీలు, సినిమా టిక్కెట్లు, బిల్లుల చెల్లింపుల్లో డిస్కౌంట్‌ ఇస్తుండడంతో తాము బదిలీ చేస్తున్న నగదుకు రెట్టింపు ఇస్తున్నారని నమ్ముతున్నారు. ఫోన్‌ మాట్లాడిన వెంటనే డబ్బులు పంపించండని చెప్పడం, బాధితులు పంపించిన నగదుకు రెట్టింపు వారి ఖాతాల్లో బదిలీ చేస్తున్నారు. రూ.రెండు వేలు నగదు బదిలీ చేసిన క్షణాల్లోనే రూ.4వేలు తన ఖాతాలోకి వస్తుండడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఖాతాలో నగదు లేకపోయినా వేరేవారి వద్ద నుంచి తీసుకుని మరీ సైబర్‌ నేరస్థులు సూచించిన ఈ-వ్యాలెట్లలోకి బదిలీ చేస్తున్నారు.

మధ్యలో ఆగిపోయాయని…
రెట్టింపు డబ్బులొస్తాయని బాధితులు నమ్ముతున్నట్లు తెలుసుకున్న వెంటనే సైబర్‌ నేరస్థులు తమ మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు. వెయ్యి రూపాయలు నగదు బదిలీ చేసిన క్షణాల్లో సైబర్‌ నేరస్థులు బాధితుల ఖాతాల్లో రూ.2వేలు జమ చేస్తున్నారు. అనంతరం వారికి ఫోన్‌ చేసి ఈసారి రూ.10వేలు పంపితే రూ.20వేలు మీ ఖాతాలో పడతాయని నమ్మకంగా చెబుతున్నారు. బాధితులు రూ.10వేలు పంపించగానే… రూ.20వేలు వచ్చేశాయ్‌.. చూసుకోండి అంటున్నారు. తమ ఖాతాలోకి ఇంకా నగదు రాలేదని బాధితులు చెబితే… అయ్యో.. మధ్యలో ఆగిపోయాయి… సాంకేతిక సమస్యలున్నాయి… మీరు రూ.20వేలు ఈ-వ్యాలెట్‌కు బదిలీ చేయండి.. మొత్తం రూ.60వేలు ఒకేసారి పంపిస్తామని వివరిస్తున్నారు. బాధితులు రూ.20వేలు పంపించిన మరుక్షణం.. సైబర్‌ నేరస్థుల చరవాణి స్విచ్ఛాఫ్‌ అవుతుంది. బాధితులు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ప్రయోజనం ఉండదు. ఇలా రోజుకు ఐదు నుంచి పదిమందికి ఫోన్లు చేసి నగదు బదిలీ చేసుకుంటున్నారు. రూ.వెయ్యి, రూ.రెండువేల నగదు వచ్చిన వారు మాత్రమే నేరస్థుల బారిన పడుతున్నారని, పేటీఎం పేరుతో ఫోన్లు వస్తే నమ్మవద్దని సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *